NIMS | ఖైరతాబాద్, ఆగస్టు 21 : లీడ్లెస్ పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ ప్రక్రియతో ఏడుపదులు దాటిన ఓ వృద్ధుడికి నిమ్స్ వైద్యులు ప్రాణం పోశారు. నాంపల్లికి చెందిన 77 ఏండ్ల కె. సుందర రావు కొంతకాలంగా హార్ట్ బ్లాక్‌తో బాధపడుతున్నారు. చికిత్స కోసం నిమ్స్ దవాఖానకును సందర్శించగా, కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రమాకుమారి పరీక్షించి పేస్మెకర్ పెడితేకాని సమస్య తీరదని గుర్తించారు. సంప్రదాయ చికిత్సలో ఛాతీపై కోతతో శస్త్రచికిత్స చేసి దానిని అమరుస్తారు. ఈ తరహా చికిత్సకు రోగి నిరాకరించడంతో ఆధునిక లీడ్లెస్ పేస్‌మేకర్‌ను అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. డాక్టర్ రామకుమారి, డాక్టర్ న్యూషా దొడ్డి, డాక్టర్ ఉమా దేవి, డాక్టర్ ఐ. సదానందం, డాక్టర్ మెహరున్నీసా బృందం పేస్‌మేకర్‌ను తొడ సిర ద్వారా నేరుగా గుండెకు విజయవంతంగా అనుసంధానం చేశారు. ఈ చికిత్స ద్వారా రోగి సంపూర్ణంగా కోలుకుంటారని వారు తెలిపారు. లీడ్లెస్ పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్‌కు ప్రైవేట్‌లో సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని, నిమ్స్‌లో రూ.60 వేల హ్యాండ్లింగ్ చార్జెస్‌తో పూర్తి చేశామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని అభినందించారు.