కంటోన్మెంట్, మే 21: బస్తీ మొదలు జిల్లా స్థాయిదాకా ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీల్లో భాగంగా జిల్లాస్థాయి క్రీడలను నేటి నుంచి నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా క్రీడలు, యువజన అధికారి సుధాకర్ తెలిపారు. ఆదివారం ఆయన సీఎం కప్ పోటీలకు సంబంధించి జింఖానా మైదానాన్ని అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో మూడు రోజులపాటు జరిగే ఈ క్రీడోత్సవాల్లో జిల్లా నుంచి సుమారు 1500 మంది హాజరు కానున్నట్లు చెప్పారు. ప్రత్యేకించి వచ్చే క్రీడాకారులకు భోజనం ఏర్పాట్లు, శానిటేషన్, మెడికల్, రిసెప్షన్, ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటితో పాటు క్రీడల నిర్వహణ, ఎంపికల కమిటీలో సంబంధిత క్రీడా సంఘాల బాధ్యులు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులను భాగస్వాములను చేసినట్లు పేర్కొన్నారు. వేసవి నేపథ్యంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. క్రీడాకారులు సకాలంలో హాజరయ్యేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. పారదర్శకంగా జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.
సైన్ బోర్డ్‌ల ఏర్పాటు..
జిల్లాకు చెందిన 16 మండలాల నుంచి వచ్చే క్రీడాకారులు క్రీడా మైదానాన్ని సులువుగా గుర్తించేందుకు వీలుగా ప్రధాన ద్వారం వద్ద సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు సుధాకర్ చెప్పారు. రిసెప్షన్ కమిటీలో తొలుత ఆయా మండలాల కోచ్, మేనేజర్లు ఎంట్రీ ఫారాలను ఆధార్ కార్డు జిరాక్స్‌లు సమర్పించాలని, వివరాలు సరిగా ఉంటేనే ఆడేందుకు అనుమతిస్తామన్నారు. ప్రతి రోజూ క్రీడలు ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
ప్రారంభించనున్న మంత్రి తలసాని..
నేటి నుంచి జరిగే సీఎం కప్ క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జెల నాగేశ్, మన్నె క్రిషాంక్లతో పాటు పలు విభాగాల అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.