Blood Cancer | బంజారాహిల్స్, మే 27: ‘అమ్మా రేపటినుంచి నాకు సమ్మర్ హాలీడేస్.. అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్దాం..’ అంటూ ఉత్సాహంగా వచ్చిన కొడుకు రాత్రయ్యే సరికి అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారిది మధ్యతరగతి కుటుంబం. పిల్లలకు చదువు చెప్పించడమే గగనం. అలాంటిది ఆస్పత్రిలో చేరిన బాబుకు నెలరోజుల్లోనే సుమారు రూ.7 లక్షలదాకా ఖర్చవగా, పూర్తిగా నయం కావాలంటే మరో రూ.30లక్షల వరకు అవసరం ఉంటుందని వైద్యులు చెప్పారు. దీంతో వారు ఏమీ చేయాలో తెలియక దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం, మాచన్నపల్లికి చెందిన బండారి శ్యామ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. భార్య స్రవంతి ఇంట్లోనే టైలరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె తేజస్విని(12), కుమారుడు శ్రీహాన్(8) ఉన్నాడు. శ్రీహాన్ రెండో తరగతి పూర్తై 3వ తరగతిలో చేరాడు. ఈ క్ర మంలో ఆ కుటుంబానికి ఊహించని ఉపద్రవం ఎదురయింది. గత నెల 18న స్కూల్ నుంచి ఉత్సాహంగా తిరిగి వచ్చిన శ్రీహాన్.. రేపటినుంచి స్కూల్‌కు సెలవులు ఇచ్చారు.. ఎక్కడికి వెళ్దాం అమ్మా.. అంటూ అడిగాడు. అప్పుడు శ్రీహాన్ వంటిమీద నల్లని మచ్చలు గమనించిన తల్లి స్రవంతి.. సాయంత్రం స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రి కి తీసుకువెళ్లగా రక్తపరీక్షలు చేసిన వైద్యులు బ్లడ్ క్యాన్సర్ కావచ్చని అనుమానాలు వ్య క్తం చేశారు. వెంటనే బంజారాహిల్స్‌లోని రెయిన్బో హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. అక్కడ బాలుడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించారు.
ప్లేట్లెట్స్, రక్తాన్ని ఎక్కించడంతోపాటు కీమో థెరపీని అందజేస్తున్నారు. హైరిస్క్‌లో ఉన్నాడని వైద్యులు చెప్పారు. నెలరోజుల్లోనే సుమారు రూ.7లక్షల దాకా ఖర్చయిందని బాలుడి తండ్రి శ్యామ్ తెలిపాడు. ఇప్పటి వరకు తెలిసినవారి వద్ద అప్పులు తేగా.. ఇక అప్పు పుట్టే పరిస్థితి లేదని కన్నీళ్లపర్యంతమయ్యాడు. బాలుడి తల్లిదండ్రుల పరిస్థితి చూసిన రెయిన్బో వైద్యులు సోమాజిగూడలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో మాట్లాడి వసతిని కల్పించారు. సోమాజిగూడ నుంచి నాలుగురోజులకు ఒకసారి వచ్చి కీమో థెరపీతోపాటు చికిత్స అందిస్తున్నారు.
కీమో థెరపీతో తగ్గకపోతే బోన్ మ్యారో మార్పిడీ సర్జరీ చేయాల్సి ఉంటుందని, సదరు సర్జరీకి రూ.12లక్షల దాకా ఖర్చవడంతో పా టు ఆ తర్వాత మందులు, ఇంజెక్షన్ల కోసం లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని తల్లిదండ్రులు తెలిపారు. ఎవరైనా దాతలు సా యం అందిస్తేనే తమ కొడుకు బతుకుతాడని కన్నీళ్లతో వేడుకున్నారు. ఎవరైనా దాతలు తమ బాబును బతికించాలని వేడుకుంటున్నారు. తమకు సాయం చేయదలుచుకునేవారు ఫోన్: 9963991194కు ఫోన్ చేయాలని వారు కోరుతున్నారు.