కందుకూరు, జూన్ 20 : కొత్తగూడ గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు సూపర్వైజర్ ఇందిర తెలిపారు. ఈ విషయంలో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల 19వ తేదీన నమస్తే తెలంగాణ దినపత్రికలో కొత్తగూడలో అంగన్వాడి సొంత భవనం ఏర్పాటు చేయాలి, శిథిలావస్థకు చేరిన బీసీ కమ్యూనిటీ హాల్, అవస్థలు పడుతున్న విద్యార్థులు అనే కథనానికి సూపర్వైజర్ ఇందిర స్పందించారు. ఈ క్రమంలో ఇందిర అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి టీచర్ సరస్వతితో పాటు పిల్లలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం బీసీ కమ్యూనిటీ హాల్ రేకుల షెడ్డును పరిశీలించి, ఆటస్థలం, ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు .ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. త్వరలో నిధులను మంజూరు చేయడానికి తన వంతు కృషి చేస్తానని వివరించారు. పక్కా భవనం నిర్మాణం చేపట్టినట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ తల్లోజు సరస్వతి వివిధ గ్రామాల టీచర్లు పాల్గొన్నారు.