సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, దీంతో చేతివృత్తులు ఉత్పత్తి కేంద్రాలుగా మారడం ఖాయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని భాగ్యనగర్ ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి గౌరీశంకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కులవృత్తులను ఆధునీకరించుకోవాలని అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్న బృహత్తర ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. చేతివృత్తులను ఆధునీకరించుకోగలిగితే పోటీ ప్రపంచంలో నిలబడటమేగాకుండా ఉత్పత్తి రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చనే ఆలోచనతో సీఎం కేసీఆర్ బీసీలకు రూ.లక్ష అందించే పథకాన్ని చేపట్టారని పేర్కొన్నారు. సంపద పెంచాలి-సంపద పంచాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు.
బీసీల కోసం ప్రభుత్వం అందించే లక్ష సాయం నిరంతరంగా కొనసాగుతుందన్నారు. చేతివృత్తుల్ని ఆధునీకరిస్తే ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని, వాటిని దేశవిదేశాలకు ఎగుమతులు చేస్తే బహుజనులు బలమైన శక్తులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఒకనాటి ఇంజినీర్లుగా ఉన్న విశ్వకర్మలు నేటి కాలపు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందిన సృష్టికర్తలుగా మారాల్సి ఉందన్నారు. వ్యవసాయానికి నాగలి, ఇంటికి గడప, గృహనిర్మాణానికి ముగ్గులు పోసిన నాగరిక సమాజానికి నాంది పలికిన విశ్వకర్మలు సాంకేతిక విజ్ఞాన విప్లవాలను సొంతం చేసుకొని రాష్ర్టాభివృద్ధి, దేశపురోగతిలో కీలకపాత్ర పోషించే దశకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
ఉమ్మడి పాలనలో విశ్వబ్రాహ్మణులకు చేయూత కరువైందని, అత్యధికంగా ఆత్మహత్యలు జరిగాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత విశ్వబ్రాహ్మణుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విశ్వకర్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అడ్లూరి రవీంద్రాచారి అధ్యక్షత వహించారు. విశ్వకర్మల అభ్యున్నతికి శ్రమిస్తున్న ఫౌండేషన్ అధ్యక్షుడు రవీంద్రాచారి దంపతులను జూలూరు ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ విశ్వకర్మ-విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ భవనం ట్రెజరర్ రవీంద్రాచారి, అప్పగిరి చెలిమోజు, సీఐ మాధవరావు పాల్గొన్నారు.