Minister Seethakka | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): మానవ అక్రమ రవాణా నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం సమష్టిగా కృషి చేస్తున్నదని మంత్రి సీతక్క తెలిపారు. ఈ తరహా నేరాల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా నిరోధానికి చేపట్టిన సదస్సులో మంత్రి సీతక్క మాట్లాడారు.
ఇట్లాంటి సకల నేరాలకు మాదక ద్రవ్యాల వినియోగమే కారణమని సీతక్క చెప్పారు. మానవులతో వ్యాపారం చేయడం, వారి శరీరాలను ఉపయోగించుకోవడం, వెట్టి చాకిరీ చేయించడం ద్వారా సంపద సృష్టించుకోవాలనుకోవడం మంచిది కాదన్నారు. నేరం జరిగిన వెంటనే బాధితులకు సత్వర న్యాయం చేయడంతో పాటు.. నిందితులకు త్వరగా శిక్షలు పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. పేదరికం, వెట్టిచాకిరీని ఆసరాగా చేసుకొని కూలీలను, మహిళలను, పిల్లలను అక్రమంగా రవాణా చేస్తున్నారని, దాని చుట్టూ అల్లుకున్న ఆర్థిక మూలాలను పోలీసులు ఛేదించాలన్నారు.
కోల్‌కతాలో ఓ డాక్టర్‌కు భద్రత లేకపోతే.. ఇంకా మహిళలకు భద్రత ఎక్కడుందని సీతక్క ప్రశ్నించారు. పురుషుల ఆలోచనా విధానం మారినప్పుడే మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణించగలుగుతారని తెలిపారు. ఈ అక్రమ రవాణాల్లో పాల్గొంటున్న వారు ఎంతటివారైనా పోలీసులు వదిలిపెట్టొద్దని కోరారు. అలాగే, డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుడిసెల్లో బతికే ఆడబిడ్డకు కూడా పోలీసులు రక్షణ కల్పిస్తారనే భరోసా కలుగాలని సీతక్క ఆకాంక్షించారు.
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాఫికింగ్‌ను ఎదురోవడంలో మీడియా పాత్రను వివరించారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయెల్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సామూహిక చర్యకు శక్తినిచ్చే వ్యూహాలను అన్వేషించాల్సిన అవసరాన్ని చెప్పారు. క్షేత్రస్థాయిలో వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అజోయ్ వర్గీస్, రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిస్త్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, డీఐజీ రెమా రాజేశ్వరి, ఐఏఎస్ దివ్య దేవరాజన్, పద్మశ్రీ అవార్డు గ్రహిత సునీతా కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. 15 మంది గెస్ట్ స్పీకర్స్‌తో పాటు దేశ నలుమూలల నుంచి 225 మంది అతిథులు పాల్గొన్నారు.