
హిమాయత్‌నగర్,జనవరి2: హిమాయత్‌నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ప్రమా దకరమైన మూలమలుపులు ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇరుకురోడ్లు, రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేయడంతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు పరంపరంగా కొనసాగుతున్నాయి.ముఖ్యంగా హిమాయత్‌నగర్ వైజంక్షన్, తెలుగు అకాడమీ సమీపం, హైదర్‌గూడ, వైయంసీఎ, కింగ్‌కోఠి, నారాయణగూడ,లిబర్టీ తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.మూలమలుపుల సమీపంలో ఉన్న డివైడర్ దగ్గరకు వచ్చేవరకు వాహనాలు కనిపించడం లేదని సూచిక బోర్డులను ఏర్పాటు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఈ మార్గంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వాహనదారులు కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి..
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం.అతివేగం, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నాం. మూల మలుపుల వద్ద వాహనదారులను అప్రమత్తం చేసేందుకు రేడియం రిప్లిక్టెడ్ స్టడ్స్(ఆర్ఆర్ఎస్), మిర్రర్లతో పాటు సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నాం. మూలమాలుపుల సమీపంలో వాహనదారులు నెమ్మదిగా వెళ్తూ తగిన జాగ్రతలు తీసుకోవాలి.
-నారాయణగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్