సిటీబ్యూరో, మార్చి 18(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిపై సీరియస్‌గా ఉందని, డ్రగ్స్ నిర్మూలన సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఎక్సైజ్‌శాఖ భవనంలో హైదరాబాద్ డివిజన్ ఎక్సైజ్‌శాఖ ఉద్యోగులకు, ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లకు ఆయన క్యాష్ రివార్డులు అందజేసి మాట్లాడారు. డ్రగ్స్ కేసుల నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, వారికి తాగునీటితో పాటు సంక్షేమ పథకాలు నిలిపివేయాలని సీఎం ఆదేశించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఎక్సైజ్ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లు గుర్తించాలన్నారు.
నగరంలో ఎక్కువగా డ్రగ్స్, గంజాయి, నాన్‌డ్యూటీ ఫెయిడ్ లిక్కర్, ప్యూరియస్ లిక్కర్, ఇతర మత్తు పదార్థాలకు నెలవుగా ఉందని, ఎక్సైజ్ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్, డీటీఎఫ్ టీమ్‌లు గుర్తించి సమయస్ఫూర్తితో కట్టడి చేయడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. నార్కోటిక్, పోలీసు, ఇతర ఏజెన్సీలకు దీటుగా ఎక్సైజ్‌శాఖ పనిచేయాలని, మన పనితీరే మన డిపార్టుమెంట్‌కు పేరు తెచ్చి పెడుతుందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఎక్సైజ్ శాఖ సామాజిక బాధ్యతతో డ్రగ్స్, మత్తు పదార్థాలపై అందరికంటే ముందు ఉండేలా చూడాలన్నారు. హైదరాబాద్ డివిజన్లో 16కేసుల్లో 41మందికి డైరెక్టర్ క్యాష్ రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి, అనిల్‌కుమార్‌రెడ్డి, ఏఈఎస్‌లు శ్రీనివాసరావు, స్మితా సౌజన్యలతో పాటు సీఐలు జగన్మోహన్రెడ్డి, రామకృష్ణ, చంద్రశేఖర్, శ్రీనివాస్, కోటమ్మ, శిరీష, మహేశ్ పాల్గొన్నారు.