శామీర్పేట, జనవరి 20 : పల్లె ప్రగతికి పాలకవర్గం కృషి చేయాలని, అందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాల సహకారం అందిస్తుందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యా అన్నారు. మూడుచింతలపల్లి మండలం ఆద్రాస్పల్లి గ్రామాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన గ్రామ పంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం తదితర అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
గ్రామ పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరినందున నూతన భవనం నిర్మాణం, స్థలం కేటాయింపునకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నూతన పంచాయతీ భవనం నిర్మాణం కోసం గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచే దిశగా పాలకవర్గం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించి సుపరిపాలన చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవినాయక్, సర్పంచ్ లలితానర్సింహులు, ఉపసర్పంచ్ జహంగీర్, పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్, మాజీ సర్పంచ్ యాదగిరి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.