బడంగ్‌పేట, జనవరి 13 : యువత క్రీడల్లో రాణించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తుక్కుగూడలో తుక్కుగూడ మున్సిపాలిటీ యూత్, పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్‌ను మంత్రి ప్రారంభించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో యువత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగ యువతకు అండగా ఉంటున్నారన్నారు. స్వామి వివేకానంద ఆశయ సాధనలో యువత కలలను సాకారం చేసుకునే దిశలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోటీల్లో పాల్గొంటున్న 26 జట్లకు అభినందనలు తెలిపారు. తుక్కుగూడ యూత్‌కోసం ఒక మంచి క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఉండేలా కృషి చేస్తున్నారని అదే విధంగా పట్టణాల్లో కూడా ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. మహేశ్వరం, బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లలో 3 ఎకరాల్లో క్రీడా మైదానాల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. తుక్కుగూడ ప్రాంతంలో 52 కంపెనీలకు సంబంధించిన యూనిట్లు వచ్చాయని తద్వారా ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీవెంకట్రెడ్డి, కౌన్సిలర్లు సప్పిడి లావణ్యారాజు ముదిరాజ్, రవినాయక్, తేజస్వినీశ్రీకాంత్, సుమన్, మార్కెట్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ స్నేహాసురేశ్, బీఆర్ఎస్ నాయకులు విజయ్‌కుమార్, బండ మల్లేశ్, రామకృష్ణ, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ విద్యార్థులు.. విదేశాల్లో సత్తాచాటాలి
తెలంగాణ విద్యార్థులు విదేశాల్లో సత్తాచాటాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మండల పరిధిలోని లేమూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. కరోనా మహమ్మరితో విద్యా వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొన్నదని, ఆ సమయంలో డిజిటల్ విద్యా బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఉపాధ్యాయులు అందించిన సహకారం గొప్పదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడానికి మనఊరు-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. సర్పంచ్ పరంజ్యోతి, జడ్పీటీసీ జంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేశరశెట్టి చంద్రశేఖర్, హెచ్ఎం అరుంధతి, కల్లేశ్, కొండల్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మన్నే జయేందర్ ముదిరాజ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని సురేందర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు, తాసీల్దార్ మహేందర్‌రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.