బడంగ్‌పేట, ఏప్రిల్16 : నిరుద్యోగ మార్చ్ కంటే ముందు ఏటా కేంద్ర ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాల సంగతేంటని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. బాలాపూర్‌లోని బాల్‌రెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళిత బంధు దేశమంతా అమలు చేయాలని బీజేపీ నాయకులు ప్రధాని మోదీని డిమాండ్ చేయాలన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన తర్వాత బీజేపీ నేతలు మాట్లాడాలన్నారు. తప్పుడు ప్రచారానికి తెరలేపడంలో బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. నిరుద్యోగులకు ముఖ్య మంత్రి కేసీఆర్‌పై విశ్వాసం ఉందన్నారు. దళిత బంధు పథకం ద్వారా ఎంతో మంది దళిత యువకులు అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు.మహేశ్వరం నియోజకవర్గంలో 52 కొత్త కంపెనీలు రాబోతున్నాయని ఆమె పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కొలేని వాళ్లు వ్యక్తిగత విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలోమహేశ్వరం నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, బీఆర్ఎస్ పార్టీ నియోజక వర్గం ఉపాధ్యక్షుడు నిమ్మల నరేందర్ గౌడ్, కార్పొరేటర్లు భారతమ్మ, కోఆప్షన్ సభ్యులు రఘునందన చారి,కో ఆపరేటివ్ చైర్మన్ నర్సింహరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రామిడి రాంరెడ్డి, అర్కల కామేశ్ రెడ్డి, చిగిరింత నర్సింహరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి ఘనస్వాగతం
అంతకుముందు బాలాపూర్ గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి సబితారెడ్డి బాలాపూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలాపూర్ నుంచి బాల్‌రెడ్డి గార్డెన్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి మంత్రి సబితారెడ్డికి ఘన స్వాగతం పలికారు. మంత్రిని భారీ గజమాలతో సత్కరించారు.