Cyber Crime | సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మీ ఫోన్ రెండు గంటల్లో డిస్కనెక్ట్ అవుతుందంటూ వచ్చిన ఒక ఫోన్‌కాల్‌కు స్పందించిన నిరంజన్.. ఆ ఫోన్ ఎందుకు కట్ అవుతుందని తెలుసుకోవడం కోసం వాయిస్‌లో చెప్పినట్లు 9 నొక్కాడు… వెంటనే ఒక ఆపరేటర్ ఫోన్లో మాట్లాడుతూ.. మేం టెలికాం డిపార్టుమెంట్ నుంచి అంటూ సమాధానం చెప్పాడు… నిరంజన్‌కు హిందీ, ఇంగ్లిష్ సరిగ్గా రాకపోవడంతో అతడు చెప్పేది అర్ధం కాలేదు.. ఇతడు చెప్పేది అవతలి వ్యక్తి అర్ధం కాలేదు ఫోన్ కట్ చేశాడు.
కొద్ది సేపటికి దివాకర్ అనే ఒక రిటైర్డు ఉద్యోగికి అలాంటిదే కాల్ వచ్చింది… నా ఫోన్ ఎందుకు డిస్కనెక్ట్ అవుతదంటూ హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ.. అవతలి వ్యక్తిని ప్రశ్నించాడు… అవతలి వ్యక్తి తనకు తెలియదు.. మీకు వీడియో కాల్ వస్తుంది మాట్లాడంటూ తన ఫోన్ కట్ చేశాడు… వీడియో కాల్లో ఒక వ్యక్తి పోలీసు డ్రెస్‌లో మాట్లాడుతూ.. మీ ఆధార్ కార్డు ఉపయోగించి ఇక్కడ సిమ్‌కార్డు తీసుకొని, దానిని మనీ లాండరింగ్‌లో ఉపయోగించారు, మీకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందంటూ అవతల వ్యక్తి చెప్పడంతో దివాకర్‌కు చెమటలు పట్టాయి… ఇక వాళ్లు చెప్పినట్లు వింటూ ఆ కేసు నుంచి తప్పించుకోవాలంటే ఏమి చేయాలంటూ సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేస్తూ లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.
ఈ రెండు ఘటనలలో నిరంజన్‌కు అంతగా చదువు రాదు… అందులో హిందీ, ఇంగ్లిష్ భాషపై అవగాహన లేదు.. దివాకర్ బాగా చదువుకోవడంతో రెండు భాషాలపై పట్టుంది. ఇలా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్న వారిలో ఎక్కువగా విద్యావంతులే ఉంటున్నారు. ఇతర భాషాలపై పట్టులేకుండా, అంతగా చదువు లేని వారు డిజిటల్ అరెస్ట్‌లు, ట్రేడింగ్ మోసాలలో తక్కువగా మోసపోతున్నారు. ఎక్కువగా చదువుకున్న వాళ్లకు ఏదో జరుగుతుందోనే భయం వాళ్లను వెంటాడుతుంటుంది.
మీకు వివిధ కేసులతో సంబంధాలున్నాయని ముంబై, ఢిల్లీ పోలీసులమంటూ బెదిరిస్తూ డిజిటల్ అరెస్ట్‌లు చేసేది ఒకటైతే.. ట్రేడింగ్‌లో లాభాలిస్తామంటూ నమ్మిస్తూ మోసాలు చేసేది మరొకటి. ఈ రెండు రకాలైన మోసాలలోనే బాధితులు కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. గతంలో ఓఎల్ఎక్స్, జాబ్ ప్రాడ్, క్రెడిట్, డెబిట్ కార్డులు మోసాలు ఎక్కువగా జరిగేవి, ఈ రకమైన మోసాలలో లక్షల్లోనే ఆర్థిక నష్టం ఉండేది. సైబర్‌నేరగాళ్లు తమ పంథాను మార్చేశారు. విదేశాల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు, ఇన్వెస్ట్మెంట్ ప్రాడ్స్, ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో రూ.కోట్లు మోసాలు చేస్తున్నారు.
ట్రేడింగ్ మోసాల్లో బాధితులు అత్యాశకు పోయి మోసపోతున్నారు. అదే డిజిటల్ అరెస్ట్‌లలో భయపడిపోయి, సమాజానికి ఈ విషయం తెలిస్తే అబాసు పాలవుతామనే భయంతో సైబర్‌నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. బాధితులను మోసం చేసేందుకు ఫోన్లో మాట్లాడే సైబర్‌నేరగాళ్లకు హిందీ, ఇంగ్లిష్ భాషలలో శిక్షణ ఇస్తున్నారు. దీనికి తోడు ఆయా రాష్ర్టాలకు చెందిన వారిని కూడా ఈ నేరాల్లో ఉపయోగిస్తున్నారు. ఫోన్లలో మాట్లాడేందుకు వారికి తగిన శిక్షణ ఇస్తూ, మాట్లాడటంలో నైపుణ్యం కల్గిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లలో ఓటీపీ, క్రిడిట్, డెబిట్‌కార్డు, ఓఎల్ఎక్స్లో అన్ని వర్గాల వారు బాధితులుంటున్నారు. అయితే పార్ట్‌టైమ్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ మోసాలలో చదువుకున్న వారే ఎక్కువగా బాధితులుంటున్నారు. చదువుకున్న వారికి చట్టం గూర్చి తెలియడం, ముంబై, ఢిల్లీ నుంచి పోలీసులమంటూ చెప్పడంతోపాటు వీడియోలో పోలీసు డ్రెస్‌లోనే నేరగాళ్లు కన్పించడంతో పాటు నేరగాళ్లు సీబీఐ, సుప్రీం కోర్టుల నుంచి వచ్చిన లేఖలు, అరెస్ట్వారెంట్లు, సుప్రీంకోర్టు అనుమతికి ఆదేశాలంటూ ఆయా డాక్యుమెంట్లను వాట్సాప్/ఈ-మెయిల్లో ద్వారా బాధితులకు పంపిస్తుంటారు. వాటిని చదువుకోవడంతో అందులో బాధితుడి పేరు ఉండటంతో అది నిజమేనని, అది వాస్తవంగా సీబీఐ, కస్టమ్స్,ఈడీ నుంచి వచ్చినట్లు గుడ్డిగా నమ్మేస్తుంటారు.
అయితే ట్రాయ్, సైబర్‌క్రైమ్ పోలీసులు డిజిటల్ అరెస్ట్లుండవు, రెండు గంటల్లోనే ఫోన్ స్విచాఫ్ అవుతుందని వచ్చే వాయిస్ కాల్స్ కూడా ఫేక్ అని సైబర్‌క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. ఎవరైనా సరే పోలీసులమని, విచారిస్తామంటూ ఫోన్లో మాట్లాడినా అలాంటి వాటిని పట్టించుకోవద్దని, భయపడకుండా పోలీసులకు ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే అత్యాశకు పోయి పార్ట్‌టైమ్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడి అంటే గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఫేక్ కాల్స్ విషయంలో భయపడవద్దని, ప్రజలు అవగాహన కల్గి ఉండాలని పలీసులు సూచస్తున్నారు.