సిటీబ్యూరో, నవంబర్ 16, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు దేవుడెరుగు, కనీసం పూర్తైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం లేదు. హైదరాబాద్ పర్యాటకానికే తలమానికమైన కొత్వాల్‌గూడ ఎకో పార్క్ పనులన్నీ పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోనే పనులు చేపట్టి 75 శాతానికి పైగా పూర్తి చేసింది. 25 శాతం పనులు పెండింగ్‌లో ఉండగా… ఎన్నికల కారణంగా నిలిచిపోయాయి. అయితే రేవంత్ సర్కార్ ఏర్పాటై రెండేండ్లు గడిచినా.. ప్రాజెక్టుల పురోగతిపై కనీసం ఒక్క సమీక్ష కూడా చేయలేదు.
అధునాతన టూరిజం వేదికగా కొత్వాల్‌గూడను మార్చేలా 2022లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయడంతో… ఎప్పుడో అందుబాటులోకి రావాల్సిన కొత్వాల్‌గూడ ఎకో పార్క్ నేటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. పచ్చని పరిసరాలు, అతిపెద్ద పక్షిశాలతో వినోద కేంద్రంగా మారే కొత్వాల్‌గూడ ఎకో పార్క్ అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రానుంది. ఐవరీ, బోర్డు వాక్స్, ల్యాండ్ స్కేపింగ్, వీకెండ్ క్యాపింగ్ వంటి సదుపాయాలతో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరగనున్నది. కానీ ఎంతసేపు కొత్త ప్రాజెక్టులు ప్రకటించడం, ప్రతిపాదనల పేరిట కాలయాపన చేయడమే కాంగ్రెస్ తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నది.
100 ఎకరాల విస్తీర్ణంలో ఎకో పార్క్‌ను మూడేళ్ల కిందట హెచ్ఎండీఏ చేపట్టింది. పార్క్‌తోపాటు వరల్డ్ క్లాస్ టూరిజం అనుభూతిని కలిగించేలా అక్వేరియం, పక్షిశాలతోపాటు, జంట జలాశయాలను చూసేందుకు వీలుగా లొకేషన్ స్పాట్లను కూడా అభివృద్ధి చేసింది. కానీ ప్రభుత్వ పెద్దల అలసత్వంతో పనులు నత్తనడనకన సాగడంతో ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. అధునాతన టూరిజం వసతులు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. విదేశీ టూరిస్టులను ఆకట్టుకుంటుంది.
ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎంట్రెన్స్ ఆర్చి, ఓపెన్ ప్లాజా, అప్రోచ్ రోడ్డు, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ సౌకర్యాలతోపాటు 8 వేలకు పైగా విదేశీ పక్షులతో అద్భుతమైన పక్షి కేంద్రాన్ని కలిగి ఉంది. సందర్శకులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, బల్లలను బిగించారు. కోటిన్నర అంచనా వ్యయంతో పార్కు పరిధిలో పనులను హెచ్ఎండీఏ పూర్తి చేసింది. మహానగర జంట జలాశయాలకు సమీపంలో ఉండటంతో ఇదొక వీకెండ్ ఫ్యామిలీ ఎకో టూరిజం స్పాట్‌గా మారనున్నది.
రెండేండ్లుగా ఎదురుచూపు..
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు మధ్యలో నిలిచిపోయింది. రెండేండ్ల కిందటే దాదాపుగా అన్నీ పనులను అప్పటి ప్రభుత్వం పూర్తి చేసింది. అయినా ఈ రోజు వరకు ఎకో పార్క్ ప్రారంభానికి నోచుకోలేదు. రేవంత్ సర్కారు ప్రజా సేవ కంటే రాజకీయాలు, ప్రచారాలకే ప్రాధాన్యతనిస్తున్నది. నగరవాసుల కోసం నిర్మించిన అంతర్జాతీయ స్థాయి పార్కును కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రభుత్వ అసమర్థతతో రెండేండ్లు గడిచినా అందుబాటులోకి రావడం లేదు. ప్రజా సౌకర్యాలు, అవసరాలు, అభివృద్ధి పనులు పక్కనబెట్టి, హైదరాబాద్ ప్రతిష్టను పెంచే ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నది. కాంగ్రెస్ పాలన తీరుకు కొత్వాల్‌గూడ ఎకో పార్క్ సాక్ష్యంగా నిలుస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.