సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు స్పెషల్ సమ్మరీ రివిజన్‌కు షెడ్యూల్ విడుదల చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కమిషన్ సూచించిన స్పెషల్ సమ్మరీ రివిజన్‌ను వివరించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమం వచ్చే నెల 2 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. నియోజకవర్గంలో జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా ఓటరు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ రెండు నుంచి 17 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్ 25 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ డిస్పోజల్ చేస్తామని చెప్పారు.
సెప్టెంబర్ 30 వరకు ఓటరు జాబితా ఫైనల్ పబ్లికేషన్ చేస్తామని కమిషనర్ వారికి వివరించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్లో రాజకీయ ప్రతినిధులు సహకరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కమిషనర్ కోరారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా సూచనలు స్వీకరించి సమగ్ర ఓటరు జాబితా తయారు చేస్తామన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.