Ganesh Festival | హిమాయత్‌నగర్, ఆగస్టు 21 : గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. గురువారం కింగ్‌కోఠిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, గణేష్ నిర్వహకులతో పాటు జీహెచ్ఎంసీ, జలమండలి, అగ్నిమాపక, వైద్య, విద్యుత్, ట్రాఫిక్ తదితర విభాగాలతో సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం ప్రణాళిక ప్రకారంగా జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు, పోలీస్ సిబ్బందికి సూచించారు. గణేష్ ఉత్సవాల్లో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా, సరఫరాలో అంతరాయం లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ డిప్యూటి కమిషనర్ జె.నర్సయ్య, అదనపు డిప్యూటీ కమిషనర్ నర్సింహ, సుల్తాన్ బజార్ ఏసీపీ మట్టయ్య, నారాయణగూడ పీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, కాచిగూడ పీఎస్ సీఐ జ్యోత్స్న, సుల్తాన్ బజార్ సీఐ నర్సింహ, అంబర్ పేట సీఐ కిరణ్ కుమార్, అంబర్‌పేట సర్కిల్ -16 డీసీ మారుతి దివాకర్, ఏఎంహెచ్‌వో డాక్టర్ హేమలత, నారాయణగూడ పీఎస్ ఎస్సైలు జె.శ్రీకాంత్‌రెడ్డి, శ్రీవాణి, నాగరాజు, సాయి సందీప్, డిఎస్.రాజు పలు పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.