Murder | మేడ్చల్, మే 16: వైన్స్‌లో పని చేసే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అతి కిరాతకంగా చెవులు, గొంతు, ముక్కు కోసి, కాల్చి వేశారు. ఈ దారుణ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి అత్వెల్లిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు వికారాబాద్‌కు చెందిన లక్ష్మి (50) అత్వెల్లిలో నివాసముంటూ స్థానికంగా ఉన్న ఓ వైన్స్‌లో పని చేస్తున్నది. శుక్రవారం తెల్లవారు జామున తాను ఉండే రేకుల రూంలో నుంచి పొగలు రావడం ప్రారంభించాయి. ఇది గమనించిన స్థానికకులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ చేరుకుని సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గొంతు, చెవులు, ముక్కు కోసి చంపి, ఆ తర్వాత ఒంటిపై బట్టలు వేసి కాల్చివేసినట్టు తెలుస్తోంది. క్లూస్ టీం సాయంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అనంతరం డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఈ హత్యకేసును ఛేదించేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
మూడు నెలలుగా ఒంటరిగా ఉంటున్న ఈ మహిళ దగ్గర ఉన్న నగదు, నగల కోసమే ఈ హత్య జరిగిందని.. గతంలో మహిళతో సహజీవనం చేసిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలో నిందితులను పట్టుకొని, శిక్ష పడేలా చేస్తామన్నారు. కాగా ఈ ఘటనలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.