చిక్కడపల్లి, మే28: మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమాగ్న రాజ్ భట్టాచార్య అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) కేంద్ర కమిటీ సమావేశాలు రెండు రోజులపాటు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిమాగ్న రాజ్ భట్టాచార్య మాట్లాడారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని మహిళా రెజ్లర్లు నిరసనలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో 30 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అయితే ఆ పోస్టులను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుందన్నారు. దేశ వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరికీ ఉపాధి కల్పించాలని, లౌకిక భారతదేశానికై దేశవ్యాప్తంగా ఆగస్టు మాసంలో జాతాలను చేపట్టి, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువతను జాగృతం చేస్తామని చెప్పారు. డీవైఎఫ్ఐ అఖిలభారత అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఏఏ.రహీం మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం తప్పుడు వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను పూర్తిగా విస్మరించిందన్నారు. దేశ రక్షణ వ్యవస్థ ప్రమాదంలో పడే విధంగా అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ అఖిల భారత కార్యదర్శి వర్గ సభ్యుడు జే థామస్, ఆనగంటి వెంకటేశ్, సంజీవ్ కుమార్, కేంద్ర కమిటీ సభ్యుడు థామస్, వెంకటేశ్, సంజీవ్ కుమార్, ఇర్ఫాన్ గుల్, కోట రమేశ్, అనిల్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.