సిటీబ్యూరో, డిసెంబరు 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో కమీషన్ల వసూళ్ల దందా బహిరంగానే సాగుతున్నది. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఎవరు ఏం రాసుకున్నా నాకేందంటూ డోంట్ కేర్ అంటున్న వసూల్ రాజాలు. కొందరు పాలకులు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని వారి ద్వారా వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు ఎంఎన్జేలో సాగుతున్న వ్యవహారం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నది. వివరాల్లోకి వెళితే.. ఎంఎన్జేలో మందులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లకు బిల్లులు విడుదల చేయడానికి ఓ మంత్రి పేషీకి చెందిన షాడో వ్యక్తిపై ‘నమస్తే తెలంగాణ’ కప్పం కట్టాల్సిందే అనే శీర్షికతో ప్రచురించిన కథనం.. వైద్య శాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ కథనం పై తీవ్రంగా స్పందించిన సదరు వసూల్ రాజా మంగళవారం ఎంఎన్‌జే దవాఖానకు చేరుకొని ‘నమస్తే తెలంగాణ’కు సమాచారం ఎవరిచ్చారంటూ అక్కడున్న సిబ్బందిపై చిందులేసినట్లు సమాచారం. రాయడానికి వీలు లేని బూతు పురాణం చదివి తన నిజస్వరూపాన్ని ప్రదర్శించినట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా ఎవరు ఏమి రాసిన ఏమి చేయలేరంటూ యథేచ్ఛగా మందులు సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్లను పిలిపించి దవాఖానలోనే బిల్లుల సెటిల్మెంట్ల దుకాణం పెట్టినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఓ ఏజెన్సీకి ఐదు కోట్ల రూపాయల బిల్లు సెటిల్మెంట్ చేసినట్లు తెలిసింది. సాయంత్రం వరకు సదరు డిస్ట్రిబ్యూటర్‌కు చెక్కులు రెడీ చేసి ఇవ్వాలని దవాఖాన సిబ్బందికి హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన సిబ్బంది ఒక్క రోజులో చెక్కు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పడంతో ఆ చెక్కును వీలైనంత త్వరగా ఇవ్వాలంటూ ఆదేశించినట్లు తెలిసింది. ఒక ప్రైవేట్ వ్యక్తి యధేచ్చగా దవఖానలోకి వచ్చి కోట్ల రూపాయల బిల్లు సెటిల్మెంట్ చేస్తున్నాడంటే దీని వెనుక ఎవరున్నారో అర్ధం చేసుకోవచ్చంటూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు. పేషీ పెద్దల సూచన మేరకే ఈ కమిషన్ల సెటిల్మెంట్ల వ్యవహారం యధేచ్చగా సాగుతున్నట్లు సచివాలయంలో గుసగుసలు విన్పిస్తున్నాయి.
