హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంధన పరిరక్షణే ధ్యేయంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్ఈడీ దీపాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో 5.53 లక్షల వీధి దీపాల ఏర్పాటుకు బీఆర్ఎస్ చొరవ దోహదం చేసింది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాతావరణ మార్పులను ఎదురోవడంలోనూ, భవిష్యత్ తరాల ప్రయోజనాలను కాపాడడంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిప ల్ కార్పొరేషన్ పటిష్టత సాధించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే లక్ష్యంతో జాతీయ ఇంధన పరిరక్షణ ఉద్యమానికి నాంది పలికింది.
కార్పొరేషన్ ఇంధన సామర్థ్యం (ఈఈ), ఇంధన పరిరక్షణ (ఈసీ) లకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్ ) ద్వారా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో జీహెచ్ఎంసీ నగరం అంతటా సుమారు 5.53 లక్షల ఇంధన-సమర్థవంతమైన ఎల్ఈడీ వీధి దీపాలను విజయవంతంగా పునరుద్ధరించింది. ఇంధన సామర్థ్యం, పరిరక్షణపైనే కాకుండా పట్టణ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణపై జీహెచ్ఎంసీ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేస్తోందని కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేరొన్నారు.