Hyderabad | కుత్బుల్లాపూర్, మార్చి 23 : తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతోనే స్నేహితులతో కలిసి హత్య చేశానని దూలపల్లి హత్యకేసులోని ప్రధాన నిందితుడు తెలిపాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో పదిమందిని అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌పేట్ ఎల్లారెడ్డిగూడకు చెందిన హరీశ్(28) ఓల్డ్ సిటీ కుల్సుంపురకు చెందిన యువతిని ప్రేమించాడు. కాగా వీరి ప్రేమ వ్యవహారంలో యువతి అన్న దీన్‌దయాల్ పలుమార్లు హెచ్చరించాడు. అయినా హరీశ్ వినకుండా ఫిబ్రవరి 22న హరీశ్ యువతి చదువుతున్న కళాశాలకు వెళ్లి కలిశాడు.
అంతేకాకుండా సుభాష్‌నగర్‌లోని వారి ఇంటికి కూడా తీసుకువెళ్లాడు. దీంతో కోపోద్రిక్తుడైన దీన్‌దయాల్ ఎలాగైనా హరీశ్‌ను హతమార్చాలని స్నేహితులతో కలిసి పథకం వేశాడు. హరీశ్ మిత్రుడు మాథంగి రాజేంద్రకుమార్‌ను బెదిరించి హరీశ్‌కు ఫోన్ చేసి రప్పించాలని తెలిపారు. దీంతో ఫోన్ చేయగానే హరీశ్ యువతితో కలిసి దూలపల్లికి వస్తున్నాడు. అప్పటికే దూలపల్లి రోడ్డులో కాపుకాసున్న దీన్‌దయాల్ గ్యాంగ్ హరీశ్‌ను అడ్డుకున్నారు.
యువతిని మరో బైక్‌పై ఇంటికి పంపించి హరీశ్‌పై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు దీన్‌దయాల్‌తో పాటు త్రిముఖే నరేశ్(20), పొట్లచెరువు వెంకటేశ్‌గౌడ్(20), కె.రోహిత్‌సింగ్(20), గడ్డం అక్షయ్‌కుమార్(22), పర్వారీ అనికేత్(21), కోయల్కర్ మనీశ్(23), బూరే సాయినాథ్(21), మాతాంగి రాజేంద్రకుమార్(25), గౌతి నవనీత(30)ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. బ్యాండ్ వెంకట్ పరారీలో ఉన్నాడు.