సిటీ బ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): పట్నం పల్లె వైపు కదులుతున్నది. దసరా సెలవులు రావడంతో నగర ప్రజలంతా ఊరి బాటపడుతున్నారు. ఆదివారంతో సెలవులు ప్రారంభం కావడంతో బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది. మహానగరం నుంచి గ్రామాలకు వెళ్లే బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా రద్దీ కొనసాగుతూనే ఉంది. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎంజీబీఎస్తో పాటు జేబీఎస్, ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్ చౌరస్తా, ఆరాంఘర్, పటాన్చెరు ప్రాంతాల్లో రద్దీ విపరీతంగా ఉంటోంది.
మహాలక్ష్మి పథకం కింది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో సీట్లు దొరకక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో రెట్టింపు చార్జీలున్నా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో వెళ్తున్నారు. కొన్ని డిపోల నుంచి వెళ్లే బస్సుల్లో చిన్న పిల్లలకు కూడా పూర్తి చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే స్పెషల్ బస్సుల్లో చిన్న పిల్లలకు కూడా పూర్తి చార్జీ చెల్లించాలని చెప్తున్నట్లు తెలుస్తున్నది.
అన్ని బస్సుల్లో ‘స్పెషల్’ దోపిడీ…
దసరా పండుగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అదనంగా నడుపుతున్న బస్సుల్లో టిక్కెట్ ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. కానీ ఆయా ఏరియాల్లో ఇప్పటికే నడుస్తున్న బస్సుల్లో కూడా అనదపు ఛార్జీలు తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. స్పెషల్ బస్సులు ఏవో.. సాధారణ బస్సులు ఏవో చెప్పాలంటూ కండక్టర్లు, డ్రైవర్లను ప్రశ్నిస్తున్నారు. వారు ఎలాంటి సమాధానం చెప్పకుండానే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు.
నగరం నుంచి అన్ని రూట్లకు వెళ్లే బస్సుల్లోనూ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్లగ్జరీతో సహా అన్ని సర్వీసుల్లో అదనపు చార్జీలు బాదుతున్నారని మండిపడుతున్నారు. సర్వీసును బట్టి రూ.50 నుంచి రూ.150 వరకు అదనంగా వడ్డిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా చిన్న పిల్లలకు కూడా పూర్తి చార్జీలు వసూలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పండగపూట సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘మహాలక్ష్మి’తో మరిన్ని అవస్థలు…
మహాలక్ష్మి ఉచిత ప్రయాణాన్ని తగ్గించేందుకు కొన్ని రూట్లలో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులను గణనీయంగా తగ్గిస్తున్నారని మహిళా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల సంఖ్య తగ్గడంతో మహిళలకు సీట్లు దొరక్కపోవడంతో గొడవలు పడుతున్నారు. సీట్ల కోసం పాట్లు పడుతున్నారు. పురుషులైతే పెరిగిన ధరలకు టిక్కెట్లు కొని మరీ మూడు, నాలుగు గంటల నిలబడే ప్రయాణించాల్సి వస్తున్నది. చిన్న పిల్లలు, వృద్ధులకు కూడా సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నడుస్తున్న కొద్దిపాటి బస్సుల్లో సీట్ల కోసం కొట్లాటలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పండగ రద్దీ.. మరోవైపు ధరల మోతతో పాటు మహాలక్ష్మి పథకం వర్తించే బస్సులు కిక్కిరిసిపోతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మెజార్టీ బస్సులను సమాన్య రోజుల్లో అందుబాటులో ఉంచి పండుగ రోజుల్లో తగ్గించడమేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.