Hyderabad | దుండిగల్, ఏప్రిల్18: హైదరాబాద్‌లోని బహదూర్‌పల్లిలో మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఓ గేటెడ్ కమ్యూనిటీలోకి అక్రమంగా ప్రవేశించిన యువకులు.. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డుపై దాడికి దిగబడ్డారు. వారిని అడ్డుకోబోయిన మహిళలను బండబూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం కాలనీకి చెందిన మన్నె గణేశ్ అలియాస్ లల్లు (24), వారాల అజయ్ (24), నితిన్ (24), తిరుమలేశ్ (27) తోపాటు మరో యువకుడు కారు(ఏపీ28- బీయూ 6886)లో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కొంపల్లి వైపు నుంచి బహదూర్‌పల్లి మీదుగా సూరారం వెళ్తున్నారు. ఈ క్రమంలో బహదూర్‌పల్లిలోని అయోధ్య విల్లాల వద్దకు రాగానే షార్ట్‌కట్‌లో వెళ్లొచ్చని గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్గా విధులు నిర్వహిస్తున్న నేపాల్‌కు చెందిన దిలీప్ వారిని అడ్డుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహం, అసహనానికి గురైన యువకులు పక్కనే ఉన్న మరో కారును తమ కారుతో ఢీకొట్టారు. అనంతరం కారులో నుంచి కిందకు దిగి.. మమ్మల్నే అడ్డుకుంటావా అని సెక్యూరిటీ గార్డును చితకబాదారు.
సెక్యూరిటీ గార్డుపై దాడి చేయడం గమనించిన స్థానిక మహిళలు అడ్డుకోబోయారు. కానీ రెచ్చిపోయిన యువకులు సదరు మహిళలను కూడా బండబూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయిన తర్వాత సెక్యూరిటీ గార్డును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు దిలీప్ భార్య ఫూల్ భాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, యువకులు మద్యం మత్తులో ఉన్నారా? గంజాయి సేవించారా? అనేది టెస్టులు చేసిన అనంతరం వెల్లడిస్తామని దుండిగల్ సీఐ సతీశ్ తెలిపారు.