Hyderabad | సైదాబాద్, ఫిబ్రవరి 23 : పాత కక్షలను దృష్టి పెట్టుకొని మద్యం మత్తులో ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల, బాధితుల కథనం ప్రకారం.. సైదాబాద్ సింగరేణి కాలనీ ఘణపురం గుడిసెల్లో నివసించే మూడవత్ సురేష్ నాయక్(22)ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన జగన్ అతని మిత్రుడు హర్షద్ ఇద్దరూ కలిసి స్థానికంగా నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవిస్తున్నారు. అంతలోనే మూడవత్ సురేష్ నాయక్ అతని స్నేహితుడు నితిన్‌తో కలిసి వారి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల సూచన మేరకు సురేష్ నాయక్ ఇంటికి వెళ్తుండగా.. ఒక్కసారిగా జగన్ తన వద్ద ఉన్న కత్తితో అతనిపై దాడి చేశాడు. కడుపులో విచక్షణారహితంగా పొడవడంతో.. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న సురేష్‌ను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యుల సహకారంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తమ కుమారుడిపై దాడికి పాల్పడిన జగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సైదాబాద్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై సాయి కృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.