శేరిలింగంపల్లి: వీకెండ్ థీమ్ పార్టీల పేరుతో డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తున్న ది కేవ్పబ్పై పోలీసులు దాడి చేసి.. గంజాయి తీసుకున్న 24 మందితో పాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. డీసీపీ వినీత్ వివరాలు వెల్లడించారు. ఖాజగూడలోని ఎస్వీ ఆర్కేడ్ భవనంలోని ‘ది కేవ్ పబ్’లో డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో శనివారం రాత్రి ఎస్వోటీ, నార్కోటిక్, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఆ సమయంలో ఉన్న 55 మంది నుంచి నమూనాలు సేకరించగా, 24 మంది గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. పార్టీకి వచ్చేముందు వీరందరూ గంజాయి సేవించి ఈ పార్టీలో పాలుపంచుకున్నట్లు గుర్తించారు.