సైదాబాద్, మే 29: మద్యం మత్తులో కారును అతివేగంతో నడిపి.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. తప్పించుకునే క్రమంలో అదే వేగంతో కారులో ముందుకు దూసుకెళ్లి మరో మహిళను ఢీకొట్టాడు. ఆమెకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తపేట హుడా కాంప్లెక్స్‌కు చెందిన బానో తు ధర్మనాయక్ (25) బుధవారం తన తండ్రి బానోతు కిషన్ నాయక్‌ను సైదాబాద్ కాలనీలో దింపి, తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. సైదాబాద్ ఎస్బీహెచ్ బ్యాంక్ కాలనీ కమాన్ వద్దకు రాగానే.. కాలనీలో నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న లక్ష్మీనగర్ కాలనీకి చెందిన ప్రణయ్‌కుమార్ రెడ్డి మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు.
ఈ ప్రమాదంలో ధర్మనాయక్ తలకు, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి వచ్చే సరికి కారును ఆపకుండా వెళ్లే ప్రయత్నంలో వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న శ్రీలక్ష్మిని ఢీ కొట్టాడు. దీంతో ఆమె చేతికి, కాళ్లకు గాయాలు కావడంతో అక్కడి నుంచి కారుతో పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కారు ప్రమాదంలో గాయపడ్డ ధర్మనాయక్ను చికిత్స నిమి త్తం కొత్తపేటలో ఓజోన్ దవాఖానకు 108 అంబులెన్స్‌లో తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు చెప్పినట్టు బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేసి రెండు ప్రమాదాలు చేసిన ప్రణయ్‌కుమార్ రెడ్డిని అరెస్టు చేసి, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.