Drunk and Drive | సిటీబ్యూరో, జనవరి 1(నమస్తే తెలంగాణ) : చెదురు మదురు ఘటనలు మినహా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. మద్యం దుకాణాలు, బార్ల వద్ద అర్ధరాత్రి వరకు రద్దీ కనిపించింది. విసృత్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామంటూ ట్రై పోలీస్ కమిషనర్లు ముందస్తుగానే ప్రజలకు సూచనలు చేస్తూ వచ్చారు. దీనికి తోడు బార్లు, పబ్బులు, ఈవెంట్ నిర్వాహకులు క్యాబ్‌లు, ఆటోలతో పాటు డ్రైవర్లను కూడా అందుబాటులో ఉంచారు. మరో సంస్థ కార్లు, ద్విచక్రవాహనాలను ఉచితంగా పంపిణీ చేస్తామంటూ ముందుకొచ్చింది. ఇలా మద్యం జోరుగా విక్రయాలు సాగినా ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవడంతో గత ఏడాది కంటే ఈ ఏడాది డ్రంక్ డ్రైవ్ కేసులు 359 తగ్గాయి.
నగరంలో మద్యం దుకాణాలు, బార్ల వద్ద అర్ధరాత్రి వరకు భారీగా రద్దీ కనిపించింది. యువకులు రోడ్లపై అర్ధరాత్రి వాహనాలపై తిరుగుతూ కేరింతలు కొట్టారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు అడుగడుగునా ఏర్పాటు చేశారు. అబిడ్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఏర్పాటు చేస్తే అదే రూట్లో కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో మరో చోట ఇలా ఒకే రూట్లో పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహించారు. అర్ధరాత్రి తరువాత ఉదయం 2 గంటల వరకు ఈ ్రడ్రైవ్లో చాలా చోట్ల కొనసాగాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకే రూట్లో పలు చోట్ల పెట్టడంతో అర్ధరాత్రి ట్రాఫిక్ రద్దీ ఏర్పడి, సాధారణ వాహనదారులు పోలీసులే ట్రాఫిక్ జామ్ చేయడం ఏంటీ అంటూ మండిపడ్డారు.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఫ్లైఓవర్లు మూసేశారు. ట్రాఫిక్, లా అండ్ అర్డర్ పోలీసులు అర్ధరాత్రి బందోబస్తులు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటల తరువాతే యువకులు రోడ్లపైకి వచ్చి స్నేహితులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఖాళీ రోడ్లపై కార్లు, బైక్‌లపై వేగంగా వెళ్తూ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే 12 గంటల తరువాత పోలీసులు రోడ్లపై ఉంటూ అతి వేగాన్ని కట్టడి చేస్తూ విస్త్రతంగా డీడీ చేయడంతో గత ఏడాది కంటే ఈ ఏడాది కేసులు తక్కువ నమోదయ్యాయని పోలీసులు చర్చించుకుంటున్నారు. కాగా, పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో మొత్తం 49 మందిపై కేసులు నమోదు చేశారు. వెంగల్రావుపార్కు వద్ద జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్ల్లో ఓ వ్యక్తికి ఏకంగా రికార్డు స్థాయిలో 550 పాయింట్లు వచ్చాయి.
ట్రై కమిషనరేట్లలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ) కేసులు
కమిషనరేట్ : డీడీ కేసుల సంఖ్య
హైదరాబాద్ : 1184
సైబరాబాద్ : 839
రాచకొండ : 619