Drunk and Drive | సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): నగరంలో ద్విచక్రవాహనదారులు మత్తులో తూగుతున్నారు. మత్తులో తూలుతున్న వీరు ఏ డివైడర్‌నో, ఏ బ్రిడ్జినో ఢీకొట్టడం.. లేదా ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదాల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపే వారే కాకుండా, వారి కారణంగా ఏ పొరపాటు లేని ఇతర వాహనదారులు, పాదచారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. అయితే, ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా, జైలు శిక్షలు వేసినా కూడా మందుబాబుల ప్రవర్తనలో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు.
ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం మరణాలు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగానే జరుగుతున్నాయి. దీనిపై అటు పోలీసులు, ఇటు సామాజిక వేత్తలు ఎంత ప్రచారం చేసినా, అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 15న ఒకే రోజు సాయంత్రం 6.30 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు.. ఎనిమిదిన్నర గంటల్లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మొత్తం 349 మంది పట్టుపడ్డారు. అందులో 253 మంది ద్విచక్రవాహనదారులే ఉండటం గమనార్హం. అయితే, పట్టుబడిన వారిలో 21- 30ఏండ్ల వయస్సు వారే అధికంగా ఉన్నారని, ఆ తరువాత స్థానంలో 31- 40ఏండ్ల వయస్సు వారు ఉన్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు.