సిటీబ్యూరో, మార్చి 30(నమస్తే తెలంగాణ): మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పెద్దఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. శనివారం ఒక్కరోజు జరిపిన ఈ తనిఖీలలో మొత్తం 222 మంది మందుబాబులను పట్టుకున్నారు. వీరంతా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో దొరికిపోయారు. పట్టుబడిన వారిలో 163 మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా, 9మంది త్రిచక్ర వాహనదారులు, 48 మంది నాలుగు చక్రాల వాహనదారులు, ఇద్దరు భారీ వాహనదారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. బ్లడ్ ఆల్కాహాల్ కాన్సంట్రేషన్(బీఏసీ) రేంజ్ 200ఎంజీ/100ఎంఎల్ నుంచి 500ఎంజీ మధ్య 13 మంది ఉన్నారని, బీఏసీ రేంజ్ 500ఎంజీల కంటే ఎక్కువగా ఉన్నవారు 5మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పట్టుబడిన వాహనదారులందరినీ న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు తెలిపారు. కాగా, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమై ఇతరుల ప్రాణాలు తీస్తే వారిపై భారతీయ న్యాయ సన్హిత 2023 చట్టం, 105 సెక్షన్ కింద గరిష్ఠంగా 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించడం జరుగుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.