సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా కమిషనర్ అవినాశ్ మహంతి కమిషనరేట్ ప్రాంతంలోని ఆయా ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి పర్యటించారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ను పరిశీలించారు.
అధికారులను అడిగి ఆయా ప్రాంతాల వివరాలు తీసుకున్నారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 605 కేసులు నమోదయ్యాయి. 36 బృందాలు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నాయి. పట్టుబడ్డ వారిలో 8 మందికి రక్తంలో 300 ఎంజీ, 230 మందికి 100 ఎంజీల రీడింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, కుషాయిగూడ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయని వివరించారు. పట్టుబడ్డ వారిని కోర్టులో హాజరు పరిచి, వారి ్రడ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసేందుకు ఆర్టీకు సిఫారస్ చేయనున్నట్లు వివరించారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పెద్ద ఎత్తున మందుబాబులపై కేసు నమోదు చేశారు. కమిషనరేట్ పరిధిలో 55 బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో 695 ద్విచక్ర, 31 త్రిచక్ర, 199 కార్లను పరీక్షించగా, 928 మంది మద్యం సేవించినట్లు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు.