పీర్జాదిగూడ, ఫిబ్రవరి 1: పీకల దాకా మద్యం తాగి ఆ మత్తులో కారును అతి వేగంగా నడిపి ఓ పసిబాలుడి ప్రాణాన్ని బలిగొన్నాడో ప్రబుద్ధుడు. ఈ హృదయ విదారకర ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం మహబూబాద్ జిల్లా, పెద్దగూడూరు మండలం, తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన వాంకుడోతు అశోక్, అనూషలు హైదరాబాద్కు వలస వచ్చారు.
మేడిపల్లి సీపీఆర్ఐ ప్రధానరోడ్డులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్మెన్గా పనిచేస్తూ పక్కనే గుడిసెవేసుకుని ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని కారు గుడిసెలో నిద్రిస్తున్న అశోక్ కుమారుడు అక్షిత్ని(4) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి తలకు తీవ్రగాయాలు కావడంతో గాంధీకి తరలించగా చికిత్సపొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బాలుడి తల్లిదండ్రులు అక్కడ లేకపోవడంతో వారికి ప్రమాదం తప్పిందని స్ధానికులు పేర్కొన్నారు.