సిటీబ్యూరో, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): డ్రగ్స్ అమ్మే క్రమంలో తాము ఎక్కడా దొరకకుండా వేరే వాళ్ల ఫోన్లను ఉపయోగించడమో లేక అసలు ఫోన్లే లేకుండా వేర్వేరు పద్ధతుల్లో డ్రగ్స్ అమ్మడమో చేస్తున్న వారిని చాకచక్యంగా హెచ్‌న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్‌న్యూ డీసీపీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ డ్రగ్స్ రాకెట్ వివరాలు వెల్లడించారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్షయ్ ఏ పటేల్ డ్రగ్ పెడ్లర్ కాగా ఆదిత్య వర్ధన్ సబ్ఫెడ్లర్.. వీరిదగ్గర నుంచి రూ.39లక్షల విలువ చేసే ఎక్స్టసీ పిల్స్ 363 గ్రాములు, ఓజీ 41 గ్రాములు, ఎల్ఎస్డీ బ్లాట్స్ 4 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర పెడ్లర్ సింహాచలం అనే పాతనేరస్తుడితో పాటు వేణు అనే సబ్పెడ్లర్ను అరెస్ట్ చేసి వారి వద్ద రూ.12.75లక్షల విలువ చేసే హాష్‌ఆయిల్, రెండు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలానగర్‌కు చెందిన సాయినిఖిల్ దగ్గర 115గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. వీరంతా దాదాపు ఫోన్లు వాడకుండా తమకున్న పరిచయాలతో పాటు వేరే ఫోన్లు లేదా సోషల్‌మీడియా ద్వారా డ్రగ్స్ అమ్మకాలు సాగించేవారని డీసీపీ తెలిపారు.
శ్రీకాకుళానికి చెందిన సింహాచలం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో అక్రమ కార్యలాపాలకు పాల్పడుతూ సబ్పెడ్లర్ల ద్వారా హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేసే నెట్‌వర్క్‌ను నిర్మించాడని గైక్వాడ్ పేర్కొన్నారు. కూకట్‌పల్లికి చెందిన వేణు అనే వ్యక్తి గతంలో ఒక కేసులో అరస్టై జైలుకు వెళ్లినప్పుడు అక్కడ అతనికి సింహాచలంతో పరిచయమేర్పడి బయటకు రాగానే హాష్ ఆయల్ కొనుగోలు చేసి కస్టమర్లకు విక్రయించడం మొదలుపెట్టాడు.
అక్షయ్పటేల్ డ్రగ్స్‌కు బానిసై ఆ తర్వాత కొరియర్ సర్వీసెస్, ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ తెప్పించి ప్తూస్థాయి పెడ్లర్‌గా మారాడని, ఆదిత్యవర్ధణ్ చదువుకునే సమయంలో డ్రగ్స్‌కు బానిసవడంతో అతనిని పునరావాస కేంద్రానికి పంపినా మారలేదని అక్షయ్ నెట్‌వర్క్‌లో సబ్పెడ్లర్గాచేరి కమిషన్ కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని డీసీపీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ చెప్పారు. ఈ నేరగాళ్లను అరెస్ట్ చేయడంలో హెచ్‌న్యూ ఇన్స్పెక్టర్లు వెంకట్, బాలస్వామి, ఎస్సైలు వెంకటరాములు, మనోజ్‌కుమార్, చిలకలగూడ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ అశోక్, ఆడిబట్ల ఎస్సై సైదయ్య తదితరులు ప్రతిభ కనబరిచారని గైక్వాడ్ తెలిపారు.