Drugs Peddlers | మాదాపూర్, ఫిబ్రవరి ( నమస్తే తెలంగాణ) 6: వేర్వేరు సంఘటనల్లో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు నిందితులతోపాటు బెంగుళూరుకు చెందిన మరో ఐటీ ఉద్యోగి పరారీలో ఉన్నారు. ఈ సంఘటన గురువారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్జత్ నగర్ అలేఖ్య హోమ్స్ నివాసి చంద్రపు ప్రసన్నకుమార్ రెడ్డి (28) ప్రైవేట్ కంపెనీలో విదులు నిర్వహిస్తున్నాడు. బెంగుళూరులోని హెబ్బల్ వాసి కెవిన్ (40) డ్రగ్స్ వ్యాపారి.. ఈ నెల 6న ప్రసన్నకుమార్‌రెడ్డికి డ్రగ్స్ విక్రయించేందుకు మాదాపూర్ లోని హైటెక్స్ మెటల్ చార్మినార్ వద్దకు వచ్చాడు.
దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు డ్రగ్స్ వ్యాపారి కెవిన్‌ను అరెస్ట్ చేసి ప్రసన్న కుమారురెడ్డి వద్ద రూ.5 లక్షల విలువైన 23 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పాల్వంచ వాసి జూపల్లి విశ్వమిత్ర, మణికొండ నివాసి శ్రీనివాస సాయి దీపక్, సికింద్రాబాద్ వాసి వరుణ్ గౌడ్ పరారీరీ ఉన్నారు. ఇదివరకు కెవిన్.. బెంగుళూరులో డ్రగ్స్ విక్రయించేవాడని పోలీసులు చెప్పారు. కెవిన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయించడం మొదలుపెట్టాడని పోలీసులు తెలిపారు. పోలీసులు వీరి వద్ద నుండి రూ.5 లక్షల విలువైన కొకైన్, రూ.10 లక్షల విలువైన బ్రెజ్జా కారు (టీఎస్ 15 ఎఫెకె 8341) లను స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో మాదాపూర్‌లోని చందానాయక్ తండా పీజీ హస్టల్లో ఉంటున్న గుత్తా తేజ కృష్ణ (28) అర్కిటెక్ట్‌గా పని చేస్తున్నాడు. బెంగుళూరుకు చెందిన సంధ్య (27) ఐటీ ఉద్యోగం చేస్టూ డ్రగ్స్ సరఫరా చేస్తుండగా ఈ నెల 6న మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు గుత్తా తేజ కృష్ణను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌పై తరలించారు. మరో నిందితురాలు సంధ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తేజ కృష్ణ వద్ద నుండి రూ.1.33.680 లక్షల విలువైన 11.14 గ్రాముల ఎండీఎంఏతోపాటు రూ.20 వేల విలువైన మొబైల్ ఫోన్లను జప్తు చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసినందుకు ఎస్ఓటీ బృందాన్ని మాదాపూర్ డీసీపీ వినీత్ అభినందించారు.