మేడ్చల్, డిసెంబర్ 10: మేడ్చల్ ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. గత నెల 30వ తేదీన యాదాద్రిలో మూతపడిన పరిశ్రమలో మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని తయారు చేస్తున్న ఓ వ్యక్తిని మేడ్చల్‌లోని పారిశ్రామికవాడలో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు కిలో మెఫెడ్రోన్‌తో పట్టుకున్న విషయం తెలిసిందే. మంగళవారం మరోమారు మత్తు పదార్థాన్ని యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు మేడ్చల్‌లో పట్టుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు సోమవారం మేడ్చల్ బస్టాండ్‌కు చేరుకొని నిఘా పెట్టారు. ఓ వ్యక్తి బస్సులో నుంచి మత్తుపదార్థంతో దిగగానే అధికారులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని, తన వద్ద ఉన్న డ్రగ్స్ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ కార్గో కార్యాలయంలో తూకం వేశారు. దాదాపు 600 గ్రాములు బరువు ఉన్నట్టు గుర్తించారు. నిందితుడిని, డ్రగ్స్‌తోపాటు మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.