సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): నిషేధిత అల్ఫ్రాజోలం మాత్రలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. గురువారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన పువ్వాడ లక్ష్మణ్, పొద్దుటూరుకు చెందిన కేతుపల్లి మునిశేఖర్ నిషేధిత అల్ఫ్రాజోలం మాత్రలను ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
కల్తీ కల్లు తయారీలో మత్తు కోసం వినియోగించే ఆల్ఫాజోలం మాత్రలను యూపీ, బీహార్ తదితర రాష్ర్టాల్లో నాలుగు రూపాయలకు ఒక మాత్ర చొప్పున కొనుగోలు చేసి నగరంలో రూ.10 నుంచి రూ.20కి ఒక మాత్ర చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీమ్ లీడర్ సుభాశ్ చందర్ బృందం, ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు బృందం, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనిల్ రెడ్డి, గోవింద సింగ్‌లు కలిసి హయత్‌నగర్‌లోని ఆటోనగర్‌లో నిందితుల నివాసం వద్ద మాటు వేశారు.
కొరియర్ ద్వారా వచ్చిన డ్రగ్స్‌ను తీసుకుంటుండగా డీసీఏ, ఆబ్కారీ బృందాలు సంయుక్తంగా కలిసి దాడులు చేసి నిందితులిద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.48లక్షల విలువ చేసే లక్షా 80వేల అల్ఫ్రాజోలం మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్, సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వలా రెడ్డి, రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.