సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): నగర శివారులోని ఓ మామిడి తోటలో రహస్యంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రంపై ఈగల్ ఫోర్స్ టీం దాడులు నిర్వహించి డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేసింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈగల్ పోలీసుల కథనం ప్రకారం.. సూర్యపేట జిల్లా తిరుమలగిరికి చెందిన కీసరి మత్య్సగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన నిమ్మల నరేష్..
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలోని బాటసింగారంలో మామిడి తోటలో ఒక షెడ్‌ను ఏర్పాటు చేసి అక్కడ మెఫెడ్రోన్ తయారు చేస్తూ ఇతర ప్రాంతాల్లో విక్రయాలు చేస్తూ దందా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు బుధవారం అర్ధరాత్రి తర్వాత మామిడి తోట నుంచి సూర్యపేట్‌కు డ్రగ్స్‌ను తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని వారి నుంచి 750 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో కీసరి మత్య్సగిరి నేరచరిత్రపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
2015లో మత్స్యగిరి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సాయి కెమెకిల్స్లో ఉద్యోగం చేస్తూ గుజరాత్‌కు చెందిన విజయ్, సంతోష్ సింగ్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారు అక్రమంగా మెఫెడ్రోన్ తయారు చేస్తుండగా ఆ ప్రక్రియను నేర్చుకున్నాడు. తక్కువ జీతంతో అసంతృప్తిగా ఉంటూ ఆ డ్రగ్స్ తయారీ ముఠాతో చేతులు కలిపి దేశ వ్యాప్తంగా అక్రమ డ్రగ్స్ తయారీ కేంద్రాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. ఇలా అప్పటి నుంచి డ్రగ్స్ దందాలో ఆరితేరిన మత్స్యగిరి పలుమార్లు అరస్టై జైలు జీవతం కూడా గడిపాడు. పోలీసులు ఇతడిపై పీడీయాక్టు కూడా నమోదు చేశారు.
అయినప్పటికీ నేర కార్యకాపాలను మానుకోలేదు. ఇటీవల తాజాగా నిమ్మల నరేష్ సహకారంతో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని మామిడి తోటలో కొత్తగా డ్రగ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు ఏశాడు. మామిడిడీ తోటకు వాచ్‌మెన్‌గా ఉన్న నిమ్మల నరేష్ బంధువు రావుల మహేష్‌తో ఒప్పందం కుదుర్చుకొ. తోటలో ఉన్న షెడ్డులో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మత్స్యిగిరి, నరేష్ అరెస్ట్ కాగా విజయ్, సంతోష్‌సింగ్, ముడి సరుకు అందించిన ప్రభాకర్ పరారీలో ఉన్నారని.. ఈగల్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఈ ముఠా నుంచి రూ.50 లక్షల విలువైన డ్రగ్స్, డ్రగ్స్ తయారీ పరికరాలు, కారును స్వాధీనం చేసుకున్నారు.