సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఆబ్కారీ శాఖలో మత్తు మాఫియా రాజ్యమేలుతోంది. ఆయా కేసుల్లో పట్టుబడిన డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలు దహన వాటికల నుంచి పక్కదారి పడుతున్నాయి. డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగాన్ని అరికట్టాల్సిన ఆబ్కారీ శాఖలోని కొందరు సిబ్బందే, కంచె చేనును మేసిన చందంగా ధ్వంసం చేయాల్సిన మత్తు పదార్థాలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇప్పటికే కొందరు అధికారులు, సిబ్బంది మత్తు మాఫియాలతో అంటకాగుతున్నారంటూ వస్తున్న ఆరోపణలకు, తాజాగా గంజాయి విక్రయం కేసులో తాండూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ పట్టుపడడం మరింత ఆజ్యం పోస్తోంది.
పర్యవేక్షణ లోపమా.. వ్యాపారమా..
తాండూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ గులాం సుల్తాన్ అహ్మద్ ఆబ్కారీ శాఖలోని కొందరు అధికారులకు నమ్మిన బంటు. డ్రగ్స్, గంజాయి కేసులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాడనే ప్రచారం ఉంది. అయితే అధికారుల నమ్మకాన్ని, నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న సుల్తాన్ అహ్మద్ గత కొంత కాలంగా పట్టుబడిన గంజాయిని తిరిగి విక్రయించడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈనెల 4న షాద్‌నగర్ పోలీసుల తనిఖీల్లో సుల్తాన్ అహ్మద్ బంధువు అంజద్ పట్టుబడటంతో ఈ ఘటన బట్టబయలైంది. అయితే నిందితుడు గంజాయి మాత్రమే విక్రయిస్తున్నాడా లేక కొకైన్ వంటి ఖరీదైన డ్రగ్స్ కూడా విక్రయిస్తున్నాడా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. దీనిపై ఎక్సైజ్ అధికారులు పెదవి విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
మార్కెట్లోకి ఎంత.. దహనవాటికల్లోకి ఎంత?
డ్రగ్స్ నిర్మూలన కోసం ఆబ్కారీ శాఖలో ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్, డీటీఎఫ్ వంటి పలు రకాల ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ప్రతి రోజు సంబంధిత అధికారులు ఏదో ఒక చోట డ్రగ్స్ లేదా గంజాయి కేసులు పట్టుకోవడం, నిందితులను అరెస్టు చేసి, మత్తు పదార్థాలను సీజ్ చేయడం చూస్తున్నాం. కానీ అదే సమయంలో పట్టుబడిన మత్తు పదార్థాలు కేసు దర్యాప్తు తరువాత దహన వాటికలకు వెళ్తున్నాయా లేక తిరిగి మార్కెట్లోకి వేళ్తున్నాయా అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. నిబంధనల ప్రకారం పట్టుబడిన గంజాయి, డ్రగ్స్‌ను కేసుల దర్యాప్తు ముగిసిన తరువాత ప్రభుత్వ గుర్తింపు పొందిన రసాయన దహన వాటికల్లో ఉన్నతాధికారుల అనుమతి, ఆదేశాల మేరకు దహనం చేస్తారు.
ఈ ప్రక్రియ మొత్తం సీనియర్ అధికారుల పర్యవేక్షణలో జరగాలి. మత్తు పదార్థాలను దహన వాటికలకు తరలించే ముందు, తరలించిన తరువాత తూకం సరిగ్గా ఉందా లేదా పరిశీలిస్తారు. కానీ తాజా ఘటనలో పట్టుబడిన గంజాయి, గడిచిన మార్చి నెలలోనే దహనం చేసినట్లు రికార్డులో నమోదై ఉంది. అంటే దహనం చేయాల్సిన గంజాయి దహన వాటిక వరకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి తప్పించారా లేక మార్గ మధ్యలోనే కొంత గంజాయిని దొంగిలించారా అనేది ప్రశ్నార్థకం.
ఆరోపణలు ఉన్న అధికారులను అందలం ఎక్కించడంతోనే…
మత్తు మాఫియాలతో సంబంధాలున్నట్లు గతంలోనూ కొందరు అధికారులపై ఆరోపణలు వచ్చినా వారినే అందలం ఎక్కిస్తుండడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు సొంత శాఖలోనే వినిపిస్తున్నాయి. గతంలో ధూల్‌పేట కేంద్రంగా పనిచేసిన ఒక అధికారి నలుగురు కానిస్టేబుళ్లతో కలిసి గుడంబా, మత్తు మాఫియాలతో అంటకాగినట్లు అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్న విషయం తెలిసిందే.
సదరు అధికారి ఆ కానిస్టేబుళ్ల సహకారంతో పెద్ద ఎత్తున కేసులు పట్టుకుంటూ నిందితుల పట్ల సింహంలా అధికారుల మన్ననలు పొందుతూనే మరోపక్క కనిపించని సింహంలా గుట్టుచప్పుడు కాకుండా మత్తు మాఫియా నుంచి అందినంత దండుకుంటూ పరోక్షంగా గుడంబా, మత్తు వ్యాపారాలకు సహకరించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొంత కాలం సదరు అధికారిని పక్కన పెట్టినా, మళ్లీ తన పలుకుబడితో సదరు అధికారి కీలక బాధ్యతలు పోషిస్తున్నట్లు సొంత శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.