శంషాబాద్ రూరల్, ఆగస్టు 3: ఏండ్ల నుంచి రెండు రాష్ర్టాల్లో ఒకే నంబర్‌తో ఓ వ్యక్తి క్యాబ్‌ను నడిపిస్తున్నాడు. కొందరు క్యాబ్ డ్రైవర్లు అతడిని గుర్తించి.. పట్టుకున్నారు. స్థానిక క్యాబ్ డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ 26టీఈ 4974తో ఏపీలో.. అదే నంబర్‌తో తెలంగాణలో టీఎస్ 26 టీఈ 4974 నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓ వ్యక్తి.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులను తీసుకెళ్తున్నాడు.
అయితే వారం రోజుల నుంచి విమానాశ్రయానికి ఒకే వ్యక్తి రెండుమూడు సార్లు తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన శంషాబాద్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్లు..అతడిని పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది. కారుతో పాటు డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. విచారణ చేసి..చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు చెప్పినట్లు క్యాబ్ డ్రైవర్లు తెలిపారు. పట్టుబడిన సదరు వ్యక్తి దాదాపు పదేండ్ల నుంచి ఇలాగే తిరుగుతున్నట్లు వివరించారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఏ అధికారులను కోరారు.