సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : వద్దురా నాయనా..కాంగ్రెస్ పాలన నమ్మి మోసపోయాం.. బతుకులు ఆగమాగం, సీఎం రేవంత్ డౌన్ డౌన్ నినాదాలను నగరంలో ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన రెండో రోజు నుంచి ఇప్పటికి ప్రతి రోజు వినిపిస్తుండటం ఆటో వాలాల వేదనకు అద్దం పడుతున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, సదస్సులు, అసెంబ్లీ ముట్టడి, ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం, ప్రజాభవన్ ఎదుట ఆటోకు నిప్పు తదితర ఉద్రిక్తలతో ఆటో డ్రైవర్లు తమగళం ఇప్పటికి వినిపిస్తునే ఉన్నారు.
‘ అది డిసెంబర్ 9, 2023 ఆటో డ్రైవర్ల ఉపాధికి కాంగ్రెస్ ప్రభుత్వం చరమగీతం పాడిన రోజు. ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డు పాలు చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులతో 200 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క ఆటో డ్రైవర్‌ను కూడా సర్కార్ ఆదుకోలేదు. కనీసం కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12 వేలు కూడా ఇవ్వలేదు. ఏ బడ్జెట్లోనూ ఆటో డ్రైవర్ల ఊసేలేదు. పైగా అరకొర నడుస్తున్న ఆటోలను సైతం చిదిమెయ్యడానికి ఇంధన కొరతను పరిష్కరించడం లేదు.
గ్యాస్, సీఎన్జీ ధరలు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆటో డ్రైవర్లు అంటే రేవంత్ రెడ్డికి అక్కసు ఎందుకు? రెండేండ్లకు రూ.19,200 కోట్లు ఎక్కడ? ’ అంటూ ఆటో జేఏసీ నాయకులు గొంతెత్తారు. రెండేండ్ల నుంచి ఆటో వాలాలు తమ సమస్యలు పరిష్కరించడయ్యా అని నెత్తి నోరు మొత్తుకున్న పట్టించుకునే వారేలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్‌కు వాహన సంఘాలు రెడీ అయ్యాయి. బంద్‌కు పిలుపునిచ్చే యోచనలో ఉన్నట్టు జేఏసీ నాయకులు తెలిపారు.

పలుమార్లు చర్చలు.. ఫలితం శూన్యం..
రాష్ట్ర వ్యాప్తంగా ఆటో సంఘాల నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పదుల సంఖ్యలో చర్చలు జరిపారు. ప్రతి చర్చలో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని.. హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చారు. కానీ మంత్రి ఇచ్చిన హామీలన్నీ వట్టివేనని తేలిపోవడంతో డ్రైవరన్నలు తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో సంఘాల నాయకులను మంత్రి పిలిపించుకొని సమస్యలు పరిష్కరిస్తామని.. అసెంబ్లీలో ఆటో డ్రైవరన్నల సంక్షేమానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. దీంతో వాళ్లతా అసెంబ్లీ ముట్టడి వాయిదా వేసుకున్నారు. కానీ ఎప్పటి లాగా బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు సర్కార్ మొడిచెయ్యి చూపింది. కాగా ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని రాహుల్ గాంధీ సైతం ఎన్నికల ప్రచారంలో ఆటో డ్రైవర్లకు మాటిచ్చారు. కానీ ఏ ఒక్కరి మాట కూడా నిజం కాకపోవడంతో ఆటోడ్రైవర్లు ఆగ్రహంలో ఉన్నారు.
భిక్షమెత్తుకున్న ఆటో వాలాలు..
ఆటో డ్రైవర్లు తాము ఉపాధి కోల్పోయామని నగరంలో పలు ప్రాంతాల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. 12 రోజుల నిరసనలో భాగంగా గతేడాది నవంబర్‌లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఇమ్లీ బస్టాండ్, నాచారంలో ఆటో డ్రైవర్లు భిక్షాటన చేశారు. పలువురి దగ్గరికి వెళ్లి ఆటో డ్రైవర్ల సమస్యలను వివరించి.. అందుకు కాంగ్రెస్ పాలనే కారణమని వివరించిన విషయం తెలిసిందే.
ప్రజాభవన్ ఎదుట ఆటోకు నిప్పు..
బేగంపేటలోని ప్రజా భవన్ ఎదుట మియాపూర్‌కు చెందిన దేవుల నాయక్ (45 ) అనే ఆటో డ్రైవర్ ఫిబ్రవరి 1, 2024న తన ఆటోకు తానే నిప్పంటించుకున్న సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గిరాకీ లేక కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని మనస్తాపం చెందిన అతడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. ‘నా బతుకు రోడ్డున పడింది. కుటుంబాన్ని పోషించడమెలా?
వైరల్‌గా సూసైడ్ రిపోర్ట్..
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఉచిత బస్సు స్కీంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల వివరాలతో ‘ ఆటో డ్రైవర్ల సూసైడ్ రిపోర్ట్’ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం స్కీం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 200 మందికి పైగా ఆటో డ్రైవర్లు చనిపోయారంటూ లిస్ట్‌ను షేర్ చేశారు. ఆ లిస్ట్‌కు పేపర్ క్లిప్పింగ్స్, టీవీ చానెళ్ల వీడియోలు జత చేస్తూ ఆధారాలతో షేర్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారి చావులపై హేళనగా మాట్లాడుతుందని నెటిజన్లు ఫేస్బుక్, ఎక్స్‌లో కామెంట్స్ పెడుతున్నారు. మృతులు సారయ్య, సతీశ్‌గౌడ్, సత్యనారాయణ, అనిల్, హమీద్, అక్బర్, రాహుల్, నగేశ్, అరుణ్‌కుమార్, రవి, రామలింగయ్య తదితరుల ఫొటోలతో షేర్ చేస్తూ వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఎందుకంత అక్కసు ?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయి. ఉచిత బస్సు స్కీంతో గిరాకీ లేక నష్టపోతున్నాం. ఆటో డ్రైవర్ల చావులు సర్కార్‌కు కనిపించకపోవడం దారుణం. మా బతుకులతో చెలగాటమాడిన ఈ కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇచ్చిన హామీలన్నీ వట్టివేనని తేలిపోయింది. సంక్షేమ బోర్డు లేదు. రూ. 5 లక్షల ప్రమాద బీమా సైతం ఆచరణలో లేదు.
– మారయ్య, అధ్యక్షుడు, టీఏటీయూ
ఏడాదికి రూ.12వేలు ఎక్కడ?
ఒక్కో ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12వేలు ఇస్తామని చెప్పారని, రాష్ట్రంలో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఈ లెక్కన సుమారు రూ. 960 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు చెల్లించాలి. ఇప్పుడు రెండేండ్లు గడిచింది సుమారు రూ.19,200 కోట్ల రూపాయలు సర్కార్ బాకీ పడింది కానీ ఏ ఒక్క డ్రైవర్‌కు ఇప్పటి వరకు రూ.12వేల సాయం అందలేదు. గ్యాస్ కొరతతో ఉన్న ఉపాధి దెబ్బపడింది.
– సత్తిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఫెడరేషన్
ఆటో డ్రైవర్లను ఆదుకోండి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మాటిచ్చి ఇప్పటికి చేయలేదు. గ్యారంటీలో భాగంగా ఏడాదికి రూ.12వేలు కూడా ఇవ్వలేదు. పార్కింగ్ సమస్య, ఇష్టానుసారంగా చలాన్లు విధించడం తదితర కార్యకలాపాలతో తామంతా విసిగిపోతున్నాం.
– శాతం రమేశ్, ఉపాధ్యక్షుడు, టీఏటీయూ