Lalgadi Malakpet | మేడ్చల్, ఏప్రిల్ 17: శామీర్‌పేట మండల పరిధిలోని లాల్‌గడీ మలక్‌పేటలో గురువారం నీటి ఎద్దడిని నిరసిస్తూ మహిళలు ఆందోళన నిర్వహించారు. పంచాయతీ కార్మికుల సమ్మె కారణంగా నీళ్లు వదలకపోవడంతో మూడు రోజుల నుంచి గ్రామంలో నీళ్లు రావడం లేదు. దీంతో మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిరసన తెలిపారు.
అలాగే ఆలియాబాద్ గ్రామంలో కూడా నీళ్లు రాకపోవడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. గ్రామస్తుడు కుంచె సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ను ప్రశ్నించగా, ‘నేనేమీ చేయలేను, ఎంపీడీవోను అడగండి’ అంటూ సమాధానం ఇచ్చారు. కార్మికులు సమ్మెలో ఉన్నందున ట్యాంకర్లతో నైనా నీళ్లు సరఫరా చేయవచ్చు కదా అని అడిగితే తమకు ఆ అధికారం ఉండదన్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో సమస్య తీవ్రతరమయ్యే అవకాశం ఉందని, అప్పుడు పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.