హిమాయత్‌నగర్, డిసెంబర్10: కింగ్ కోఠి ప్రాంతంలోని ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదు ర్కొంటున్న మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం పడినా.. మురుగునీరు పొంగిపొర్లి నీరు నిలిచిపోవడంతో ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు, స్థానికు లు ఇబ్బందులు పడే వారు. మాటిమాటికి మురుగు నీటి లీకేజీ సమస్య తలెత్తడం ఇక్కడ పరిపాటిగా మారింది. జలమండలి అధికారులు మురుగునీటి లీకేజీ తలెత్తినప్పుడల్లా పూర్తిస్థాయిల్లో సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇటీవలే ఎమ్మెల్యే దానం నాగేందర్ కింగ్‌కోఠి, షేర్ఘాట్, పర్ధాగేట్ ప్రాంతంలో పర్యటించి మురుగునీటి సమస్య వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించారు.
మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నూతనంగా పైపులైన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు నిధులను మంజూరు చేశారు. సుమారు కోటి రూపాయాలతో హరివిహార్ కాలనీలో తాగునీటి పైపులైన్ నిర్మాణం, విఠల్వాడి, షేర్ఘాట్లో డ్రైనేజీ నిర్మాణ పనులు చేసేందుకు నారాయణగూడ జలమండలి అధికారులు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులు పూర్తైతే తమ కష్టాలు తీరుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై నారాయణగూడ జలమండలి మేనేజర్ మహేందర్ రెడ్డిని వివరణ కోరగా.. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే చొరవతోనే పరిష్కారం
మురుగు నీరు అంతర్గత రోడ్లలో నిలిచి పోవడంతో స్థానికంగా ఇబ్బందులు పడుతున్నాం. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల అవసరాలను గుర్తించి దశల వారీగా సమస్యలను పరిష్కరించండం సంతోషకరం. ఎమ్మెల్యే దానం నాగేందర్ చొరవతో మురుగు నీటి సమస్యకు పరిష్కారం లభించింది. శరవేగంగా పనులను పూర్తి చేసేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి.
– మన్సూర్, స్థానికుడు
చాలా అవస్థలు పడ్డాం..
పెరిగిన జనాభాకు అనుగుణంగా పాత డ్రైనేజీ పైపులైన్ సామర్థ్యం సరిపోకపోవడంతో తరుచూ మ్యాన్‌హోల్స్ పొంగి మురుగు రోడ్లపై పారుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీటి సమస్య వల్ల దుర్వాసన, దోమల వృద్ధితో చాలా అవస్థలు పడ్డాం. నూతనంగా డ్రైనేజీ పైపులైను ఏర్పాటుతో మురుగు సమస్య తీరింది.
– ఇక్బాల్ అత్తాస్, స్థానికుడు