సిటీబ్యూరో/ముషీరాబాద్/మెహదీపట్నం, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో ఆదివారం కురిసిన వర్షానికి ఇద్దరు మృతిచెందగా, ముగ్గురు గల్లంతయ్యారు. రెండుచోట్ల నాలాల్లో పడి గల్లంతైన వారి కోసం స్టేట్డిఆర్ఎఫ్ టీమ్స్ ముమ్మురంగా గాలింపు చర్యలు చేపట్టాయి. రాత్రి నుంచి తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ వారి ఆచూకీ దొరకలేదు.
ఆదివారం కురిసిన వర్షానికి అఫ్జల్సాగర్నాలాలో అర్జున్, రాములతో పాటు ముషీరాబాద్ వినోబానగర్నాలాలో దినేశ్ అలియాస్ సన్నీ గల్లంతయ్యారు. భారీ వర్షం కురిసి వరద పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా నాలా ప్రహరీ కూలిపోయింది. అదే సమయంలో నాలా గోడకు ఆనుకొన్ని ఉన్న ద్విచక్ర వాహనాన్ని తీస్తూ దినేశ్ నాలాలోకి పడిపోయాడు. స్థానికులు కాపాడటానికి ప్రయత్నాలు చేయగా అవి ఫలించలేదు. సన్నీకి సంబంధించి టూవీలర్ దొరికింది.
అయితే తాము ఈ ప్రాంతంలో దాదాపుగా అన్ని క్యాచ్పిట్స్ ఓపెన్ చేసినప్పటికీ అందులో ఎక్కడా గల్లంతైన వారి ఆనవాళ్లు కనిపించలేదని డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో నాలాలో ప్రవాహ వేగం అధికంగా ఉండడంతో రాత్రి గాలింపు చర్యలకు కొంత ఇబ్బంది జరిగినా..ఉదయం నుంచి మాత్రం ముమ్మురం చేశారు. నాలాలో పడిపోయిన వినోబానగర్ నుంచి మూసీ నది వరకు ముమ్మరంగా గాలింపు చేపట్టినా ఆచాకీ లభ్యం కాలేదు.
డీఆర్ఎఫ్ బృందాలు నాలా మలుపులు, ఇరుకు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. వరద ఉధృతి తగ్గకపోవడంతో గాలింపు అవాంతరాలు ఎదరవుతున్నాయని డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. నాలాలో పడి వరద నీటిలో కొట్టుకుపోయిన దినేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బాధితుడి కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం, అతడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతోపాటు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అఫ్జల్‌సాగర్ మాంగార్ బస్తీ మీదుగా వెళ్లే హబీబ్‌నగర్ నాలా వద్ద నాలాకు ఆనుకుని ఉన్న రాము ఇంట్లోకి వర్షం నీటి కారణంగా నాలా నీరు వచ్చింది. నీటిలో మునుగుతున్న మంచంను తీసుకోవడానికి వెళ్లిన రాము కాలుజారి నాలాలో పడ్డాడు. ఇది గమనించిన అర్జున్ తన మామ రామును కాపాడటానికి చేతిని ఇచ్చాడు. రాము ,అర్జున్ చేతిని బలంగా పట్టుకోవడంతో ఇద్దరు నాలాలో పడి కొట్టుకుపోయారు. వీరి కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఫలించలేదు. ఇప్పటివరకు వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అధికారుల పర్యటన..!
ఆసిఫ్‌నగర్‌లోని అఫ్జల్ సాగర్ నాలాతో పాటు ముషీరాబాద్‌లోని వినోబానగర్ నాలా పరిసరాల్లో గాలింపు చర్యలను హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనలు సోమవారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. నగరంలో ముగ్గురు వేర్వేరు చోట్ల గల్లంతయ్యారని, వారి విషయంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మృతదేహాలు దొరికిన తర్వాత నిర్ధారిస్తామని కలెక్టర్ హరిచందన చెప్పారు.
ఈ ఘటనపై సీఎం రేవంత్, ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారని, మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని ఆమె పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ ప్రతీ క్యాచ్పిట్ను తెరిచి చూసిన తర్వాత వాటిని వెంటనే మూసేయాలని సిబ్బందిని ఆదేశించారు. గాలింపు చర్యలను మిగతాశాఖలతో కలిసి ముమ్మురం చేయాలని, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచించారు.
ఈ ప్రమాదాలకు కారణం నాలాల ఆక్రమణలేనని రంగనాథ్ చెప్పారు. నాలాలను ఆక్రమించి నిర్మించడమే కాకుండా వాటి ప్రవాహాన్ని దారి మళ్లించడంతో వరద సాఫీగా సాగడం లేదని, వరద ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న ఒకట్రెండు కట్టడాలనే తొలగిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. నాలాల చెంతన పేదలే ఎక్కువగా ఉన్నందున ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరై కూల్చివేయాల్సి వస్తే వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుందన్నారు.
ఈ సమస్య మళ్లీ రాకుండా జీహెచ్ఎంసీకి ప్లాన్ రూపొందించి ఇస్తామని తెలిపారు. నాలాలో పడి యువకుడు గల్లంతైన ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతదేహం కోసం గాలింపు ముమ్మరం చేశామని, పల్లం ప్రాంతాల నుంచి మొదలుకొని మూసీ వరకు డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపడుతున్నాయని, సాధ్యమైనంత తొందరగా మృతదేహాన్ని వెతికి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.
ప్రతీఏటా ఇదే సమస్య..!
ప్రతీఏటా వర్షాకాలంలో ఇదే సమస్య తలెత్తుతున్నదని స్థానికులతో పాటు నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తెలిపారు. ఈ సమస్య మూలాలను వెళ్లి పరిష్కరించాల్సిన అవసరం ఉందని, జీజిహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలతో కలిసి అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్తామని, పేదల నివాసాలు ఉన్నందున కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ వారికి తెలిపారు. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు 2200ల లారీల పూడికను తీశామని, ఇది నిరంతరంగా జరుగుతున్నదన్నారు.