స్వల్ప విస్తీర్ణంలో ఎస్టీపీల నిర్మాణం
అధునాతన ఎస్బీఆర్ టెక్నాలజీ వినియోగం
చురుగ్గా 31మురుగుశుద్ధి కేంద్రాల పనులు
తక్కువ వ్యయంతో మెరుగైన శుద్ధి
సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు వస్తున్న ఇబ్బందుల నేపథ్యంలో విదేశీ తరహాలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎస్టీపీల వైపు జలమండలి మొగ్గు చూపింది. తక్కువ స్థలంలో మురుగు శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రూ.3866.21 కోట్లతో 31 మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణంలో ఎక్కువ శాతం అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్బీఆర్) టెక్నాలజీతో కూడిన ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో రోజువారీగా వెలువడుతున్న 1650 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో జలమండలి 25 ఎస్టీపీల్లో 772 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేస్తుంది.
ఉత్పత్తి అవుతున్న మురుగులో 46.8శాతమే శుద్ధి అవుతున్నది. మరో 878 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 31 ఎస్టీపీలను మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతున్నది. తక్కువ స్థలంలోనే వీటిని నిర్మించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో ఉన్న వివిధ బయోలాజికల్ ట్రీట్మెంట్ పద్ధతుల కంటే ఈ ఎస్బీఆర్ విధానానికి తక్కువ ఖర్చు అవుతుందని అధికారులంటున్నారు. మిగతా మురుగుశుద్ధి పద్ధతుల కంటే ఎస్బీఆర్ పద్ధతిలో మెరుగ్గా మురుగునీటి శుద్ధి జరుగుతుందని ఇది తేలికైన విధానమని, విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.