సిటీబ్యూరో, ఆగస్టు 8 ( నమస్తే తెలంగాణ) : ‘అంతా నా ఇష్టం’ అంటూ చెలరేగిపోయిన హైడ్రా అధికారులు నగరంలోని ఓ కాలనీని నరక కూపంలోకి నెట్టేశారు. హైడ్రా తప్పిదం.. ‘పైగా’ కాలనీ వాసులకు నరకం చూపిస్తున్నది. కంటోన్మెంట్ ప్యాట్నీ నాలాకు అడ్డుగా ఉండి కాలనీని భారీ వర్షాల నుంచి రక్షిస్తున్న రిటైనింగ్ వాల్‌ను హైడ్రా అధికారులు అనాలోచితంగా గతంలో కూల్చేసిన విషయం తె లిసిందే.. ఈ ప్రభావం రసూల్‌పుర, పైగా కాలనీని వెంటాడుతుంది. అందులో భాగంగా గురువారం కురిసిన భారీ వర్షానికి ఆ కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
మొత్తం మురుగు నీరు ఇండ్లల్లోకి చేరి ఆక్రమించింది. ఆ డ్రైనేజీ నీళ్ల కంపు భరించలేక ఆ కాలనీ కుటుంబాలన్నీ రాత్రంతా నరకం చూశాయి. తెల్లారినా ఆ సమస్య సమసి పోలేదు. ఆ మురుగు తీసేందుకు శుక్రవారం సాయంత్రం వరకు సిబ్బంది పనిచేయాల్సి వచ్చింది. ముక్కుపుటాలు అదిరేలా వస్తున్న ఆ డ్రైనేజీ కంపుతో చిన్నారులు, వృద్దులతో కూడిన కుటుంబాలన్నీ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై పేరుకుపోయిన డ్రైనేజీ నీళ్లను హైడ్రా తొలిగిస్తున్నా.. ఇండ్లల్లోకి వచ్చిన ఆ బురద నీటిని అపార్ట్మెంట్ వాసులే కూలీలను నియమించుకుని తీసే ప్రయత్నం చేయించుకుంటున్నారు. రోజంతా సిబ్బంది కష్టపడినా ఆ కాలనీ నుంచి ఆ డ్రైనేజీ దుర్గందాన్ని మాత్రం ఏం చేయలేకపోయారు. అంతాలా ఆ నాలా డ్రైనేజీ ఆ ఇండ్లను కమ్మేసింది. ఇక ఆ కాలనీ రాకపోకలన్నీ ఆ కంపును భరిస్తూ బురద నీటిలో నడవాల్సిన దుస్థితి ఆ స్థానికులది.
ప్యాట్నీ రిటైనింగ్ వాల్‌ను కూల్చేస్తే ఇటువంటి భయానక పరిస్థితులు వస్తాయని హైడ్రాకు నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా వినలేదని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ అనే స్థానికుడు.. మాట్లాడుతూ.. “గురువారం కురిసిన భారీ వర్షానికి చాలా భయపడ్డాం. రిటైనింగ్ వాల్ లేకపోవడంతో ఆ డ్రైనేజీ నీళ్లను వేగంగా మా ఇండ్లను కమ్మేశాయి. ఆ సమయంలో నేను ఆఫీస్‌లో ఉన్నాను. ఇంట్లో వాళ్లు ఫోన్ చేసి విషయం వివరించారు. వారందరిని మరో ప్రాంతంలో ఉన్న బంధువుల ఇంటికి పంపిచే ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. అప్పటికే దారులన్నీ నదిగా మారాయి. రాత్రంతా అదే దుస్థితిలో గడిపాం.’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో వాసి రవళి మాట్లాడుతూ.. ఆ బురద కంపును భరించలేకపోయాం. కొన్నిసార్లు కంపు భరించలేక వాంతులు కూడా చేసుకున్నాం.
ఆ సమయంలో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులకు ఫోన్ చేసినా ఫలితం కనిపించలేదు. ఆ రిటైనింగ్ వాల్ హైడ్రా కూల్చేసి మా బతుకులను నాశనం చేసింది.’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్వేష్ మాట్లాడుతూ.. మా ఇంటి గోడ నుంచి పక్కింటి గోడ మీదుగా రోడ్డుపైకి వచ్చి బంధువుల ఇంటికి వెళ్లిపోయామని చెప్పారు. ఆ బురద కంపు, నీళ్లు భరించలేక చాలా మంది అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. ఇప్పటికీ 30 కార్లు ఆ బురదీ నీటిలో మునిగి డ్యామేజీ అయ్యాయని వివరించారు.
“కూల్చేయడానికి పెద్ద పెద్ద అధికారులందరూ దగ్గరుండి చేశారు. మరి ఇప్పుడు పైగా కాలనీ అంతా బురద వరదలో చిక్కిపోయింది. తమను రక్షించడానికి చర్యలు తీసుకోరా” అంటూ స్థానకులు మండిపడుతున్నారు. నాలా ఆక్రమణ పేరుతో రక్షణగా ఉన్న వాల్‌ను కూల్చేయడం హైడ్రాకే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం కురిస్తే అనుక్షణం బిక్కుబిక్కుమంటు గడపాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. ఏ సమయంలో నీళ్లన్నీ తమ ఇండ్లను ముంచెత్తుతాయోనని గాబరా పడాల్సిన దుస్థితి తమది అని వివరించారు. కంటోన్మెంట్‌లోని ప్యాట్నీ నాలా వరద నివాస ప్రాంతాల్లోకి రాకుండా తాత్కాలికంగా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. అయినప్పటికీ భారీ వర్షం కురిస్తే భయంభయంగా బతకాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.