Drainage | మైలార్‌దేవ్‌పల్లి, మార్చి 13: ఏళ్ల క్రితం వేసిన డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. తూతూ మంత్రంగా అధికారులు పనితీరు ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపించాలని పలుమార్లు మోరపెట్టుకున్న ఏ ఒక్కరు స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అత్తాపూర్ డివిజన్ హైదర్‌గూడ పి.వి.నర్సింహ్మరావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 145 వద్ద జాయ్ ఆసుపత్రి వద్ద ఉన్న డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. ఫలితంగా గత అనేక రోజులుగా డ్రైనేజీ నీరు పొంగిపోర్లుతుంది. అధికారులకు ఫిర్యాదులు చేస్తే నామమాత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో తిరిగి సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ ప్రాంతంలోనే బస్టాప్ ఉండడంతో బస్సుల కోసం వేచి చూసే ప్రజలు ఈ మురుగు నీటిలోనే వేచి ఉండాల్సి వస్తుంది. ముక్కు మూసుకోని జీవిస్తున్నామని ప్రజలు స్థానికులు వెల్లడిస్తున్నారు. ఎన్నిసార్లు ఎయిర్‌టెక్ మిషన్‌తో క్లీన్ చేయించినా తిరిగి మళ్లి ఒక్క రోజు రెండు రోజుల్లోనే పొంగిపోర్లుతున్న మురుగునీరు ప్రవహిస్తుంది. దీని వల్ల పాదాచారులు, వాహనాదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా నామమాత్రంగానే చేసి వెళ్తున్నారు తప్ప శాశ్వతంగా పరిష్కారం చూపట్లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు శాశ్వతంగా పరిష్కారం చేయాలని కోరుతున్నారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఏళ్ల క్రితం వేసిన డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో డ్రైనేజీ నీరు అంతా రోడ్లపై ఏరులై పారుతున్నాయి. నడిచేందుకు సైతం వీలు లేకుండాపోతుందని స్థానికు వాపోతున్నారు. అధికారులు పాడైన డ్రైనేజీ వ్యవస్థను తొలగించి వాటి స్థానంలో కొత్త డ్రైనేజీ పైపులైన్లు వేసి సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపాలని అధికారులను వేడుకుంటున్నారు.