హైదరాబాద్: మలక్‌పేటలో (Malakpet) నేడూ ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు. చాదర్‌ఘాట్-దిల్‌సుక్‌నగర్ మార్గంలో ప్రధాన రహదారిపై పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో రోడ్డుపైకి మురుగునీరు ముంచెత్తడంతో గత రెండు రోజులుగా వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. సమస్య జటిలంగా మారడంతో అధికారులు చేపట్టిన పైప్‌లైన్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఆదివారమూ వాహనదారులకు ట్రాఫిక్ సమస్య ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో చాదర్‌ఘాట్ నుంచి దిల్‌సుక్‌నగర్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ రూట్లో ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉందని, అందువల్ల వాహనదారులు వారికి అనువైన మార్గంలో వెళ్లాలని తెలిపారు.
ప్రధాన రహదారిపై పరేషాన్
డ్రైనేజీ పైప్ పగిలిపోవడంతో మురుగు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారి అధ్వానంగా తయారైంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర సౌకర్యంగా మారింది. కాగా, చంచల్‌గూడ జైలు వద్ద నుంచి వచ్చే వరద నీటి కాలువ పిల్లర్ నంబర్ 14, 18 వద్ద డ్రైనేజీ లైన్ లో కలవడంతోని ముంపు సమస్య ఏర్పడింది. ఒకే లైన్లో వరదనీటి కాలువ, మురుగు కాలువ కలిసి ఉండడంతోనే తరచూ మురుగునీరు పొంగిపొర్లుతున్నది. ప్రస్తుతం ఉన్న సామర్థ్యం కంటే మురుగునీరు వరద నీరు ప్రవహిస్తుండటంతో డ్రైనేజీ లైన్లో లీకేజీలు అవుతున్నాయి.
సమస్య నివారించడానికి జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు రెండు వేర్వేరు పైప్లైన్ల పనులను చేపట్టాలని నిర్ణయించి, వాటి పనుల ప్రక్రియను ప్రారంభించారు. కాగా, నల్గొండ చౌరస్తా మార్గంలోడ్రైనేజీ మురుగునీరు వారం రోజులుగా పొంగిపొర్లుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీరంతా మలక్‌పేట అండర్ రైల్వే బ్రిడ్జి వరకు వెళ్లడంతో వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు.మలక్ పేట రైల్వే బ్రిడ్జి వద్ద మురుగునీరు నిలిచి పోవడంతో గంటల తరబడి వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇదిలా ఉంటే మలక్‌పేట- నల్గొండ క్రాస్ రోడ్డులో మురుగునీరు ప్రవహిస్తున్న ప్రాంతాన్ని జీహెచ్ఎం కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవీస్, జలమండలి సీజీఎం నాగేంద్ర కుమార్, మలక్ పేట జీహెచ్ఎంసీ డీసీ జయంత్, ఉన్నతాధికారులు సందర్శించారు.మురుగునీటి ఆధునీకరణ పనులు రెండు రోజుల్లో పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు