Badangpet | బడంగ్పేట్, మార్చి 7 : పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది.. డ్రైనేజ్ సమస్య నిత్య కృత్యమైపోయింది. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.. రోడ్లపై మురుగు పరుగులు పెడుతూ.. వరదల పారుతుంది. దీంతో దుర్గంధ వాసన వెదజల్లుతోంది.
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటాపూర్ 14వ డివిజన్లో డ్రైనేజీ సమస్య జఠిలంగా మారింది. గత కొన్ని నెలల నుంచి వెంకటాపూర్ వాసులు బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వెంకటాపూర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలే రంజాన్ మాసం. వెంకటాపూర్‌లో అధికంగా ముస్లింలు నివాసముంటారు. రంజాన్ మాసంలోనైనా డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ వారి గోడు ఎవరు వినడం లేదు. గ్రామపంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు వేసిన డ్రైనేజీ పైపులు ఉన్నాయి. డయా చిన్నగా ఉండడంతో సమస్య ఎదురవుతుంది. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అవసరం లేని చోట కోట్ల రూపాయల కేటాయించారు కానీ పేదలు నివాసం ఉండే ప్రాంతాలలో మాత్రం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చకపోవడం పట్ల తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
ప్రైవేటు వెంచర్లలో అడ్డగోలుగా డ్రైనేజీ పైప్ లైన్ పనులు, సీసీ రోడ్లు వేశారు కానీ పాత బస్తీలు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యతో సతమతమవుతుంటే డెయిరీ ఫామ్‌కు సంబంధించిన వారు అదే డ్రైనేజీలో కల్పడం ద్వారా సమస్య మరింత జఠిలమైందని బస్తీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు వెంకటాపూర్ వాసి కార్పొరేటర్‌గా ఉన్నప్పటికీ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించలేకపోయారు.
వెంకటాపూర్‌లో డ్రైనేజీ పొంగిపొర్లుతుందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు వరదల్లా డ్రైనేజీ రోడ్లపై పారుతుంది. అధికారులు ఎవరూ స్పందించడం లేదు. స్థానికులకు తీవ్ర సమస్యగా మారింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
వెంకటాపూర్‌లో బర్రెల పేడను డ్రైనేజీలో కలపడం వల్లనే సమస్య వస్తుంది. డ్రైనేజీ పొంగిపొర్లుతున్న మాట వాస్తవమే. డెయిరీ ఫామ్ వాళ్లకు నోటీసులు ఇచ్చాం. అయినా వాళ్లు అదే విధంగా డ్రైనేజీలో కలుపుతున్నారు. ఈ విషయంపై అధికారులకు కూడా తెలియజేశాను. గల్ఫర్ పెట్టి మరోసారి క్లీన్ చేయిస్తానని శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి తెలిపారు.