సిటీబ్యూరో, ఆగస్ట్ 4 (నమస్తే తెలంగాణ): సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు 12మందిని పోలీసులు అరెస్ట్ చేయగా సోమవారం డాక్టర్ విద్యుల్లత ను శంషాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. తనపై కేసు ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో విద్యుల్లతను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. ఇప్పటికే విద్యుల్లతపై లుకౌట్ నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. విద్యుల్లతపై గోపాలపురం పీఎస్లో రెండు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పర్మిషన్లు కూడా విద్యుల్లత పేరుమీదనే తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు డాక్టర్ నమ్రత, డాక్టర్ విద్యుల్లత ఇద్దరూ కలిసి హైదరాబాద్లో ఐవీఫ్, సరోగసీ పేరిట అమాయక ప్రజలను మోసం చేసి లక్షలు లక్షలు గుంజారంటూ పోలీ సులు పేర్కొన్నారు. మరోవైపు సంస్థ నిర్వాహకులు ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసీ పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గోపాలపురం పోలీ సులు మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
తమకు సృష్టి సెంటర్ ఇచ్చిన మెడికల్ రిపోర్టులు, వారికి డబ్బులు కట్టిన రసీదులు, ఇతర ఆధారాలు తీసుకుని వచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు చెందిన దంపతుల నుంచి ఫెర్టిలిటీ నిర్వాహకురాలు నమ్రత ఒకరి దగ్గర రూ.44లక్షలు, సరోగసీ పేరుతో హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి విశాఖకు పిలిచి అక్కడ స్పెర్మ్ తీసుకుని రూ.18లక్షలు తీసుకున్నారని ఒకరు, ఎన్నారైల నుంచి రూ.25లక్షలు, హైదరాబాద్కు చెందిన వారి దగ్గర నుంచి రూ.50లక్ష లు తీసుకున్నట్లుగా బాధితులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నమ్రత, డా.విద్యుల్లత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖ,కళ్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిలపై వేర్వేరుగా కేసు నమోదు చేశారు.