బన్సీలాల్‌పేట్, మార్చి 12 : మూత్రపిండాలు (కిడ్నీ)లు రక్తంలోని మలినాలను, అదనపు నీటిని తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని, డయాబెటిస్, బీ.పి వలన కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నదని గుర్తించాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.ఇందిర అన్నారు. ‘ప్రపంచ కిడ్నీ దినం’ సందర్భంగా నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో గాంధీ దవాఖానలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ శోభ మాట్లాడుతూ తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం, ధూమపానం మానేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చని అన్నారు.
నెఫ్రాలజీ విభాగం హెచ్ఓడి, ప్రొఫెసర్ మంజూష మాట్లాడుతూ గాంధీ దవాఖానలో కిడ్నీ బాదితులకు ఉచితంగా వైద్యం, పరీక్షలు, మందులు, డయాలసిస్ సేవలు అందిస్తున్నామని అన్నారు. కిడ్నీ వ్యాధులను ముందుగా గుర్తిస్తే, చికిత్స అందించడంతో పాటు మరింత డ్యామేజీ కాకుండా కాపాడుకోవచ్చని అన్నారు. వైస్ ప్రిన్సిపాళ్ళు డాక్టర్ రవిశేఖర్ రావు, డాక్టర్ చంద్రశేఖర్, నెఫ్రాలజీ డాక్టర్లు శ్రీకాంత్, శ్రీనివాస్, ఏఓ సుబ్బారావు, ఎంపిహెచ్ఓ వేణుగోపాల్, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.