కవాడిగూడ, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతతో పాటు మన భవిష్యత్తుకు భద్రత అని కౌన్సిలింగ్ సైకోథెరఫిస్ట్ డాక్టర్ హిప్నోపద్మాకమలాకర్ అన్నారు. మహావీర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ శాఖ, నవభారత్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్న సందేశాన్ని ఇస్తూ పర్యావరణ పరిరక్షన కోసం కాటన్ సంచులు, మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ హిప్నోపద్మాకమలాకర్ మాట్లాడుతూ.. అవసరాని కన్నా ప్లాస్టిక్‌ను ఎక్కువగా వాడుతుండటంతో సముద్రాలకు, భూమిపై ఉండే మునుషులకు, మూగజీవాలకు ముప్పుగా మారుతుందన్నారు. ప్లాస్టిక్ వాడకం పట్ల ఎవరికి వారు పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ మొక్కలను నాటాలని చెట్లను పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్య కరమైన వాతావరణాన్ని అందించాలని చెప్పారు. నీటిని వృధా చేయకుండా వర్షపు నీటిని నిలువచేసుకోవాలని సూచించారు. విద్యుత్ వినియోగాన్ని సైతం తగ్గించి సౌరశక్తికి ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. పాఠశాలల్లో పర్యావరణ విద్యను ప్రోత్సహించాలని పిల్లల్లో ప్రకృతిపై ప్రేమను పెంపొందించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చైతన్యదాయకమైన అడుగు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వాలంటీర్లు, యువకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.