సిటీబ్యూరో, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ ) : దేశంలో క్యాన్సర్ మహమ్మారి తరుముకొస్తుందని, ముఖ్యంగా మహిళలు, యువతులు కూడా ఈ ప్రాణాంతక వ్యాధి బారి న పడుతుండటం ఆందోళన కలిగిస్తుందని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డా. గురు ఎన్ రెడ్డి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ..క్యాన్సర్ నిర్మూలనకై మ హిళలు, యువత అవగాహన పెంచుకోవాలన్నారు.
దేశంలో 2022లో 1.5మిలియన్ల మంది కొత్తగా క్యాన్సర్ బారినపడ్డారని అన్నారు. ముఖ్యంగా రొమ్ము, కొలన్, సర్వైకల్, ప్రొస్టేట్, ఓవరీ, పాంక్రియాస్, హెడ్, నెక్, లంగ్, యుటెరస్ క్యాన్సర్ వ్యాధులు భారీగా పెరుగుతున్నట్లుగా తెలిపారు. 11-14 ఏళ్ల వయసులో వేసే హెచ్‌పీవీ వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను కట్టడి చేయవచ్చన్నారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో దేశంలో క్యాన్సర్ తీవ్రత పెరుగుతున్న క్రమంలో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు.